
పేదల నెత్తిన భారం మోపడం, కాకులను కొట్టి గద్దలకు వేయడం, ప్రకృతి వనరులను ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టడం.. ఇదీ 70 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని ఏలిన పార్టీలు సంస్కరణలకు ఇచ్చిన నిర్వచనం. ఆ విధానాలకు.. ఆ దోపిడీ పద్ధతులకు చరమగీతం పాడింది తెలంగాణ సర్కారు. పేదల కోసం.. బడుగు బలహీనవర్గాల కోసం.. అనేక విప్లవాత్మక నిర్ణయాలతో సంస్కరణలకు కొత్త అర్థాన్నిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశానికి కొత్తదారిని చూపడడమే కాదు సబ్బండ వర్ణాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ పరివర్తన వచ్చింది. అవినీతి లేదు.. దరఖాస్తులు తగ్గాయి. దఫ్తర్ల చుట్టూ తిరగడమూ తప్పింది.
మలి దశలో టీఆర్ఎస్ పారదర్శక పాలన
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడ్డది. ఎన్నో సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గాలకు అమలుచేస్తూ వస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత గత మూడేండ్లలో ఇదివరకటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే పరిపాలనారంగంలో విప్లవాత్మక చర్యలను చేపట్టింది. అన్ని శాఖల్లోనూ మార్పువచ్చింది. సేవల్లో వేగం పెరిగింది. అవినీతి తగ్గిపోయింది. పరిపాలనను పూర్తిగా వికేంద్రీకరణ చేసింది. కొత్త జిల్లాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, మండలాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకేచోట ఉండేలా జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్లు, అధికారుల నివాస సముదాయాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే 12 కలెక్టరేట్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాల సమీకృత కలెక్టరేట్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని ఆధునిక హంగులతో రూ.617 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యేలా రాష్ట్రంలో ఏడు కొత్త పోలీస్ కమిషనరేట్లు, 10 కొత్త పోలీస్ జిల్లాలు, 112 కొత్త పోలీస్ స్టేషన్లు, 31 సర్కిల్ కార్యాలయాలు, 25 సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటుచేశారు. 16 వర్టికల్స్ పని విధానాన్ని ప్రవేశపెట్టారు. 56 రకాల సర్వీసులతో రాష్ట్రస్థాయిలో టీఎస్‌కాప్ యాప్‌ను తెచ్చింది.
విప్లవ ధరణి
రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వేగంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతున్నాయి. రవాణ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. ఏపీలో 1,61,258 కిలోమీటర్ల పరిధిలో 826 బస్సులను టీఎస్ఆర్టీసీ తిప్పేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నది. కార్గో సేవలతో ఆర్టీసీకి రోజుకు రూ.20 లక్షలకు పైగా అదనపు ఆదాయం సమకూరుతున్నది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) పేరుతో టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ఫోర్స్ను నెలకొల్పింది. వీధి వ్యాపారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. పట్టణాలు, నగరాల్లో ఇండ్ల నిర్మాణ అనుమతులకు టీఎస్‌బీపాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నీటి కాలుష్య నివారణానికి ఎస్ఎఫ్టీల నిర్మాణం చేపట్టింది. ప్రతి వెయ్యిమందికి ఒకటి చొప్పున 4,087 మరుగుదొడ్లను నిర్మిస్తున్నది.
పెట్టుబడుల వెల్లువ
పారిశ్రామికరంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ బహుముఖ వ్యూహం అమలుచేస్తున్నారు. టీఎస్ఐపాస్ అ మల్లోకి వచ్చిన నాటి నుం చి ఇప్పటివరకు 17,516 పరిశ్రమలు ఏర్పాటయ్యా యి. రూ.2.21 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.06 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందారు. వీటిలో 15,797 తయారీరంగ పరిశ్రమలు కాగా 1,719 సేవారంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఇప్పటివరకు 334 చిన్న పరిశ్రమలను పునరుద్ధరించారు. ముచ్చర్లలో 10,400 ఎకరాల్లో అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. డ్రోన్ పాలసీ ద్వారా మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రారంభించారు.తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత ఏడాది ప్రత్యేక పాలసీని ప్రకటించింది.
వైద్యరంగంలో మనమే మేటి..
నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లా దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్‌లను నెలకొల్పుతున్నది. ప్రస్తుతం 21 హబ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభమయ్యే వైద్య కళాశాలలతో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరింది. దీంతోఎంబీబీఎస్ సీట్లు 2,700కు చేరుకొంటున్నాయి. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నారు.
సంక్షేమం.. సంతోషం
సబ్బండ వర్ణాలు ఇవాళ తెలంగాణలో సంతోషంగా జీవిస్తున్నాయి. రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నది. రజకులకు ఆధునాతన దోభీఘాట్లు, నాయీబ్రాహ్మణులకు ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు కావలసిన నిధులను కేటాయిస్తున్నది. బాల రక్షక్ 1098 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్సీల అభివృద్ధికి దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. షరతులు లేకుండానే స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తున్నది. వైన్‌షాపుల్లో ఎస్సీలకు, గౌడ కులస్తులకు రిజర్వేషన్లను కల్పించింది. నీరా పాలసీ రూపొందించి.. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పీవీ మార్గ్‌లో రూ.20 లక్షలతో నీరాకేఫ్ నిర్మిస్తున్నది. కోకాపేటలో గౌడ భవన్‌కు స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసింది.
ప్రగతిబాటన పల్లెలు
నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018లో తీసుకొచ్చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ అందజేశారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం ఏర్పాటయ్యాయి. పంచాయతీరాజ్ చట్టంలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు కేటాయించారు. కాళేశ్వరంతో సహా ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు ఆధునిక సాంకేతిక టెక్నాలజీని జోడిస్తున్నారు. 1200 చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. మేజర్, మీడియం, సూక్ష్మస్థాయి ఇరిగేషన్ ప్రాజెక్టులను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దీనివల్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకొన్నది.