హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్రకియా గందరగోళంగా మారింది. ముందూ వెనకా ఆలోచించకుండా సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వైద్యులు, రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. బదిలీల కారణంగా ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ వైద్యకళాశాల పరిధిల్లోని దవాఖానల్లో మొత్తం 107 పోస్టులు ఖాళీ అయ్యాయి. వాటిలో కేవలం 10 శాతం మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన 90 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది లా ఉండగా సూపర్ స్పెషాలిటీ, స్పెషాలిటీ పీజీ సీట్లు ఉన్న ఉస్మానియా, గాంధీ మెడికల్ కళాశాలల్లో సీట్లకు సరిపోను ప్రొఫెసర్లు కరువయ్యారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ సీట్లకు సరిపడా ప్రొఫెసర్లు లేకపోతే ఆ సీట్లను రద్దు చేస్తారు. త్వరలో ఎంసీఐ తనిఖీలు ఉం డటంతో ఆలస్యంగా కండ్లు తెరిచిన ప్రభు త్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చం దంగా ఇప్పుడు బదిలీ చేసిన వైద్యులను డి ప్యుటేషన్లపై మళ్లీ వెనక్కి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.
నిషేధ కాలంలో మళ్లీ బదిలీలా?
సాధారణ బదిలీల ప్రక్రియ జూలై 31తో ముగిసింది. ఆగస్టు 1నుంచి బదిలీలపై నిషే ధం అమల్లోకి వచ్చింది. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో ఉస్మానియా, గాంధీ హా స్పిటల్స్కు చెందిన 14 మంది సూపర్‌స్పెషాలిటీ వైద్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సదరు ప్రొఫెసర్లు ఉస్మానియా, గాంధీలోనే యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ 14 మందిలో కొందరిని జిల్లాలకు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కొరత ఉన్న సూపర్‌స్పెషాలిటీ పోస్టులు ఖాళీ అయ్యి, ఆయా విభాగాలు మూతపడే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక పక్క పీజీ సీట్లను కాపాడుకునేందుకు బదిలీపై వెళ్లిన వైద్యులను తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తూనే మరో పక్క ఉన్న సూపర్‌స్పెషాలిటీ వైద్యులను బది లీ చేసి బయటకు పంపడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో రోగులు, వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.