హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిమంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ), సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ (ఎస్డీపీవో) విభాగాల్లోనే ఈ బదిలీలన్నీ జరిగాయి. ఈమేరకు ఆయా మల్టీజోన్ల ఐజీలు, సీపీలు, జిల్లా ఎస్పీలకు డీజీపీ కాపీలు పంపారు. ఈ బదిలీ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీఆర్సీ వేసి ఫిట్మెంట్ ప్రకటించాలి
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వం వెంటనే పీఆర్సీ వేసి ఫిట్మెంట్ ప్రకటించాలని జాక్టో(జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో జాక్టో చైర్మన్ సదానందంగౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందంగౌడ్ మాట్లాడుతూ..ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. 317 జీవోపై క్యాబినెట్ నిర్ణయాన్ని అమలుచేయాలని, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఈఎస్హెచ్ సౌకర్యం కల్పించాలని, కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీస వేతన సవరణ చట్టం అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాక్టో జనరల్ సెక్రటరీ కే కృష్ణుడు, ట్రెజరర్ జీ హేమచంద్రుడు పాల్గొన్నారు.