రాష్ట్రంలోనే అదొక కీలక పోలీస్ కమిషనరేట్. రాజకీయ పైరవీల ద్వారా అక్కడ అడుగుపెట్టిన ఓ ఉన్నతాధికారి.. ఆ కమిషనరేట్‌ను పైరవీలకు కేంద్రంగా మార్చారు. దీంతో అక్కడ ఇప్పటికే ఉన్న కొందరు డీసీపీ స్థాయి అధికారులు కాంగ్రెస్ నేతల చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారు. ఆ ఉన్నతాధికారి సైతం నేతలు, ఎస్‌హెచ్‌వోలు ఇచ్చే డబ్బులను పుచ్చుకుంటూ వారు చెప్పిన వారిని ఇట్టే ఆ బదిలీ చేసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తూ ఆ ఉన్నతాధికారి రాత్రికి రాత్రే రూ.కోట్లు దండుకుంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐ నుంచి ఏసీపీ స్థాయి పోస్టింగ్‌లు కావాలంటే స్థానిక కాంగ్రెస్ నేతలనో, ‘బిగ్ బ్రదర్’నో ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏ డివిజన్లోని ఏ ఠాణాలో పోస్టింగ్ కావాలన్నా ఇట్టే వచ్చేస్తాయన్న చర్చ జరుగుతున్నది. ఏరియాను బట్టి నాయకులకు ఎక్కువ డబ్బులిస్తే.. వారు కోరుకున్న చోటుకు ఇట్టే బదిలీలు చేసేస్తున్నట్టు వినికిడి. రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా జరుగుతున్న ఆ కమిషనరేట్ పరిధిలో ఎస్‌హెచ్‌వో పోస్టుకు ఉన్న డిమాండ్‌ను కాంగ్రెస్ నేతలతో కలిసి ఆ ఉన్నతాధికారి క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. గుట్టుగా రాత్రిపూట రియల్ ఎస్టేట్ దందా చేసుకునే ఆ ఉన్నతాధికారి.. పరోక్షంగా తన పరిధిలోని డీసీపీలను ప్రోత్సహిస్తూ పోలీస్ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ రియల్ వెంచర్ వ్య వహారంలో ఆ ఉన్నతాధికారి ఇరు పక్షాలను ఒప్పిం చి.. మధ్యేమార్గంగా తన ఖాతాలో రూ.2కోట్లు వేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నెలల వ్యవధిలోనే బదిలీలు
ఆ కమిషనరేట్‌లో పలువురు ఎస్‌హెచ్‌వోలకు గత జూలైలో బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అంతకు 7 నెలల ముందు అదే స్థానాల్లో కొందరికి బదిలీలు అయ్యాయి. ఆ బదిలీల సందర్భంగా కొందరు ఎస్‌హెచ్‌వోలు స్థానిక నేతలకు, ఆ ఉన్నతాధికారికి సైతం రూ.లక్షల్లో ముడుపులు సమర్పించుకుంటే.. ఇం కొందరు ఆ స్టేషన్ పరిధిని బట్టి రూ.15-20 లక్షల వరకూ ముట్టజెప్పారట. ఇలా డబ్బులిచ్చి మరీ బదిలీలు చేసుకున్న వారు కనీసం 15 మంది వరకూ ఉంటారని వినికిడి. ఈ బదిలీల వెనుక ‘బిగ్ బ్రదర్’తోపాటు ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ కీలక నేతలున్నారని, ముందస్తు ప్యాకేజీ ప్రకారం వారికి డబ్బులు ఇచ్చిన వారినే బదిలీ చేశారని తెలిసింది.
‘అప్పుడే బదిలీ ఏందన్నా?’
‘అన్నా నేనొచ్చి కనీసం 7 నెలలు కూడా కాలేదు. కనీసం ఆ నేతకు ఇచ్చిన డబ్బులు కూడా ఇంకా సంపాదించుకోలేదు. అప్పుడే బదిలీ ఏందన్నా?’ అంటూ ఓ ఎస్‌హెచ్‌వో తన స్థానంలోకి బదిలీ అయిన మరో ఎస్‌హెచ్‌వోతో మొరపెట్టుకున్నారట. దీంతో ‘అన్నా.. అప్పుడు నువ్వు రూ.10 లక్షలే ఇచ్చావ్. ఇప్పుడు నేను ఏకంగా రూ.20 లక్షల వరకూ ఇచ్చాను. మరి నేను ఏం చేయాలి బ్రదర్? మనకు కొంత కాలం తిప్పలు తప్పేటట్టు లేవు’ అంటూ ఒకరికొకరు ఓదార్చుకుంటున్నట్టు సమాచారం. నెలల వ్యధిలోనే బదిలీల వ్యవహారం జోరుగా సాగుతుండటంతో మిగతా ఎస్‌హెచ్‌వోలు కూడా గగ్గోలు పెడుతున్నట్టు తెలిసింది. ‘డబ్బులు ఇచ్చేదాక ఒక టార్చర్.. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ టార్చర్’ అంటూ లోలోపల కుమిలిపోతున్నారట.‘ఇందుగలడు అందు లేడనే సందేహంబు వలదు’ అన్న చందంగా బిగ్ బ్రదర్ అడుగులు పోలీసుశాఖలో పాతుకుపోయాయి. సదరు ఉన్నతాధికారులు ఇంతలా రెచ్చిపోవడం వెనుక కూడా బిగ్‌బ్రదర్ ఉన్నట్టు తెలిసింది. అతనితో పాటు పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ పొలిటికల్ లీడర్ ఆదేశాలు సైతం గుట్టుచప్పుడు కాకుండా ఆ ఉన్నతాధికారి పాటిస్తారని సమాచారం.