నల్లబెల్లి, జూన్ 13: కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు ఓ కింది స్థాయి అధికారి బదిలీ అయ్యారు. ‘కండువా కప్పుకుంటేనే కరెంట్’ అనే శీర్షికన ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల విద్యుత్తు ఏఈ పెద్ది రవళిపై బదిలీ వేటు వేశారు.
ఏజెన్సీ భూములకు విద్యుత్తు సౌకర్యం కల్పించి బోర్లు వేసేందుకు మేడెపల్లి గ్రామ కాంగ్రెస్ ఎంపీటీసీ భర్త మోహన్‌తోపాటు ఆసరవెల్లి, మేడెపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు జనగాం రాజు, వంగర వెంకన్న, కార్యదర్శి ఆవుల ఐలయ్య బోరు వాహనాల ఏజెంట్ల నుంచి రూ.2.80 లక్షలు కమీషన్‌గా తీసుకుని రూ.77 వేల చొప్పున పంచుకున్నారు.
పోడు పట్టాలు పొందిన 490 మంది రైతులు 9 ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు తీయగా, ఇటీవల కాంట్రాక్టర్ విద్యుత్తు స్తంభాలు తీసుకువచ్చాడు. అయితే కరెంట్ సరఫరా ఇవ్వాలంటే సదరు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన పలువురు కాంగ్రెస్ నాయకులు.. రైతులు కమీషన్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
దీంతో బాధిత రైతులు ససేమిరా అనడంతో సదరు కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో విద్యుత్తు శాఖ అధికారులు కరెంట్ పోల్స్‌ను తిరిగి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కండువా కప్పుకుంటేనే కరెంట్’ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు శాఖ ఏఈ రవళిని రాయపర్తి మండలానికి బదిలీ చేసింది. కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు చివరకు ఉద్యోగి బలయ్యే దుస్థితి ఏర్పడింది.