హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అతిత్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక డిసెంబర్, జనవరిలో కొంతమంది అధికారులను మార్చినా లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో మళ్లీ బదిలీ చేయాల్సి వచ్చింది. అయితే, ఈ ఆరు నెలల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఎవరేమిటన్న దానిపై స్పష్టత వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సమర్థులు అని భావించి తీసుకొచ్చినవారు ఆశించిన మేరకు పనిచేయటం లేదన్న భావన మంత్రులు, సీఎంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు అధికారుల పోస్టింగ్‌ల్లో భారీగా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులను రాష్ర్టానికి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రాధాన్య పోస్టుల్లో ఉన్నవారినీ పక్కనపెడతారని తెలుస్తున్నది. అధికారుల మార్పుచేర్పుల ప్రక్రియ జూన్ 10 తర్వాత ఏ నిమిషమైనా జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. ఎన్నికల ముందు మారిన వారిని పూర్వస్థానాలకు పంపించి కొనసాగిస్తారా?
ఇతర పోస్టుల్లోకి మారుస్తారా? అని చర్చ జరుగుతున్నది.
రాష్ట్రస్థాయిలోనే ఎక్కువ ప్రక్షాళన
సెక్రటేరియట్‌లోని కొంతమంది ముఖ్యమైన అధికారులకు స్థానచలనం తప్పదని చెప్తున్నారు. సీఎస్ శాంతికుమారిని కూడా మారుస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పక్కనబెడితే ఆమె స్థానంలో ఎవరు వస్తారన్నదానిపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. శాంతికుమారి 1989 బ్యాచ్ అధికారిణి. ఆమె తర్వాత బ్యాచ్‌కు చెందినవాళ్లలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్‌గోయల్, సునీల్‌శర్మ ఉన్నారు. సునీల్‌శర్మ ఈ నెలలోనే రిటైర్ అవుతున్నారు. శశాంక్‌గోయల్ రిటైర్మెంట్కు ఇంకా సమయం ఉన్నది. ఆయనతోపాటు 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావు సీఎస్ పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రామకృష్ణారావుకే అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్రంలో సమర్థులైన అధికారుల్లో రామకృష్ణారావు ఒకరు అన్న పేరు ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు సీఎస్ ఇవ్వకుండా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానే కొనసాగించింది. ఆయనకు ఇప్పుడైనా అవకాశం ఇస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి. ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవిని తీసుకుంటారా? లేదా? అన్న చర్చ కూడా ఉన్నది.
మరోవైపు, 1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వికాస్‌రాజ్ ఎన్నికల సంఘంలో పనిచేస్తున్నారు. ఆయనను రాష్ట్ర సర్వీసుల్లోకి తీసుకోవాలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే, వీరికన్నా ముందు బ్యాచ్ 1991కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉన్నారు. కానీ, ఆయన పట్ల సీఎంకు సదభిప్రాయంలేదు. రెవెన్యూశాఖలో అధికారుల మార్పులపైనా జోరుగా చర్చ జరుగుతున్నది. ముఖ్యకార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్‌ను పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతున్నది. ఆయన స్థానంలో ఏపీకి చెందిన ఓ సీనియర్ అధికారి (ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు)ని తీసుకువస్తారని తెలుస్తున్నది. ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు అధికారి ఒకరిని తీసుకొస్తారన్న ప్రచారమూ నడుస్తున్నది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్‌ను కూడా మారుస్తారని చెప్తున్నారు. పలు శాఖల హెచ్వోడీలనూ మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను కూడా మార్చే అవకాశం ఉన్నది.
ఐపీఎస్ అధికారులు కూడా..
పలువురు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలనూ ప్రభుత్వం చేపట్టనున్నట్టు తెలుస్తున్నది. లోక్‌సభ ఎన్నికల వేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఐపీఎస్ అధికారులను కీలకపోస్టుల్లో నియమించింది. తర్వలోనే ఎన్నికల కోడ్ ముగియనుండటంతో ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసేందుకు, తమకు అనుకూలమైన వారిని కీలక పోస్టుల్లో నియమించేందుకు రంగం సిద్ధమైనట్టు సమచారం. డీఎస్పీ స్థాయి నుంచి పలువురు సీనియర్ ఐపీఎస్‌లకు సైతం స్థానచలనం తప్పదనే చర్చ పోలీసు వర్గాల్లో మొదలైంది. పలు జిల్లాల ఎస్పీలు సైతం బదిలీ వేటుకు గురికాక తప్పదని తెలుస్తున్నది. పనిలో పనిగానే ముగ్గురు ఐజీలు, మరో ఇద్దరు అడిషనల్ డీజీలు బదిలీ అవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల చివరిలో డీజీపీ ర్యాంకు అధికారి ఒకరు పదవి విరమణ చేస్తుండగా, ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? లేదా ఆయననే కొనసాగిస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఆయన గతంలో నిర్వర్తించిన విధి నిర్వహణను దృష్టిలో ఉంచుకొని మరో రెండేండ్లు కొనసాగిస్తారని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
సీఎంవోలోనూ మార్పులు?
సీఎం కార్యాలయంలోనూ పలువురు అధికారులను మార్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. సీఎంవోలోకి మరికొంత మంది సమర్థులు, అనుభవం ఉన్న అధికారులను తీసుకురావాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు అధికారులను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.