హైదరాబాద్ జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్‌శాఖను ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 91 మంది పోలీస్ ఉన్నతాధికారులను ఒకేరోజు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 51 మంది ఐపీఎస్‌లు, 40 మంది నాన్-క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు బదిలీ చేసింది. 2006 నుంచి 2020 వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మారిన పరిపాలన స్వరూపానికి అనుగుణంగా పోలీసు అధికారులను కేటాయించారు.
పలు జిల్లాల్లో చాలాకాలంగా పనిచేస్తున్న ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. పలు కమిషనరేట్ల కమిషనర్లకూ బదిలీలు తప్పలేదు. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు కల్పించింది ప్రభుత్వం. దేశంలో అత్యుత్తమ పోలీస్‌గా గుర్తింపు సాధించిన తెలంగాణ పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ బదిలీలు చోటుచేసుకొన్నాయి.