హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యుత్తు సరఫరా సంస్థ (టీజీ ట్రాన్స్‌కో) ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడటం లేదు. సంస్థ అప్పుల విలువ అక్షరాల రూ.7,361 కోట్లు. సంస్థ నికర ఆస్తుల విలువ రూ.2,663 కోట్లే. సంస్థ నికర ఆస్తులతో పోల్చితే అప్పులు రెండురెట్లు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్, వినియోగం పెరుగుతున్నది. ప్రస్తుతమున్న నెట్వర్క్ 19 వేల మెగావాట్ల డిమాండ్‌ను తట్టుకోలేదు.
ఈ ఏడాది ఇప్పటికే 18వేల పీక్ డిమాండ్ నమోదయ్యింది. ఈ నేపథ్యంలో విద్యుత్తు నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాల్సి ఉన్నది. కొత్తగా 400 కేవీ, 220కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు కట్టాల్సి ఉంది. కొత్త లైన్లు వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో రూ.4వేల కోట్లు వెచ్చించి విద్యుత్తు నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. దీంట్లో సింహభాగం అప్పుగా తీసుకోనున్నట్టు ఇంజినీర్లల్లో చర్చలు నడుస్తున్నాయి.