హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 9వ అటవీ క్షేత్రాధికారుల(ఎఫ్ఆర్వో) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న ఎఫ్ఆర్వోల స్నాతకోత్సవం జరిగింది. 18 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న ఎఫ్ఆర్వోలు క్షేత్రస్థాయిలో ఫారెస్ట్ అధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. మొత్తం 47మంది అభ్యర్థుల్లో..42 మంది గుజరాత్, నలుగురు జమ్ము-కశ్మీర్, ఒకరు లడక్‌కు చెందినవారు కాగా వీరిలో 11మంది మహిళా అధికారులున్నారు.
ముఖ్యఅతిథిగా గుజరాత్ రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్)యూడీ సింగ్, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ పాల్గొన్నారు. పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించిన అనంతరం శిక్షణలో ప్రతిభ చూపిన వారికి పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. గుజరాత్‌కు చెందిన సురేశ్‌కుమార్ దేశాయ్ అత్యుత్తమ ప్రతిభ చూపి 7 బంగారు పతకాలు సాధించి టాపర్‌గా నిలిచారు. రోనక్ కేవడియా 6 బంగారు పతకాలు, 3 వెండి పతకాలను సాధించారు. ఇక్కడ పీసీసీఎఫ్ ఎల్యూసింగ్ మేరు, అకాడమీ సంచాలకులు ఎస్జే ఆశా పాల్గొన్నారు.