హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా( DGP Ravi Gupta) మంగళవారం సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్(Visible Policing) ను అమలు చేయడం, ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త స్కైవాక్(Skywalk) లు, ఫ్లైఓవర్ల చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నది(Musi River) ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో పరిధిలో ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన అవసరముందని వెల్లడించారు.
ప్రజల నుంచే వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఐజీ తరుణ్ జోషి పాల్గొన్నారు.