ముషీరాబాద్, నవంబర్ 5: ఏ ఆంధ్రా పాలకుల పెత్తందారీ వ్యవస్థ పోవాలని కొట్లాడామో, నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల పుణ్యమా అని మళ్లీ వారి దండయాత్ర మొదలైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేశ్ ముదిరాజ్ ఆరోపించారు. టీ కాంగ్రెస్‌ను వెనుక ఉండి నడిపించడానికి వైఎస్ షర్మిల, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ముందుకొస్తున్నారని ఆరోపించారు. పార్టీలు, సిద్ధాంతాలను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడం ఉద్యమకారులను అవమానించడమేనని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దల తీరు నచ్చక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆదివారం రాంనగర్లో మీడియాతో నాగేశ్ మాట్లాడుతూ.. తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఉన్న బలం, బలగం ఎంత? క్యాడర్ ఎంత? షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉన్నదని ప్రశ్నించారు. షర్మిల మద్దతు అవసరం అన్నట్టు భట్టి విక్రమార్క మాట్లాడటం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్‌లో బీసీలపై చిన్న చూపు ఉన్నదని.. బీసీ, అట్టడుగు వర్గాల నేతలను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
దేవరకద్ర కాంగ్రెస్‌కు భారీ షాక్
మూసాపేట, నవంబర్ 5: టీపీసీసీ కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 8 మండలాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. రేవంత్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండామోసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
20 ఏండ్లుగా పార్టీకి పనిచేస్తున్నా గుర్తింపు లేదు
గంగాధర, నవంబర్ 5: ఇరవై ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా గుర్తింపు లేదని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భానుప్రియ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో ఆమె మాట్లాడుతూ.. చొప్పదండి నియోజకవర్గంలో మాదిగ సామాజికవర్గం అధికంగా ఉన్నా కాంగ్రెస్ టికెట్‌ను మాదిగలకు ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.