TPCC Revant Reddy | ప్రగతి భవన్ ఇక బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్‌గా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి భవన్ ఇక సామాన్యులకు తలుపులు తెరుస్తుందన్నారు. సచివాలయం ఇక సామాన్యుడికి తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు పెంపొందించడానికి జర్నలిస్టులు సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయానికి మద్దతు పలికిన తెలంగాణ జన సమితి నేత కోదండరామ్, మిత్ర పక్షం సీపీఐకి, సీపీఐ మాజీ రాజ్యసభ్యుడు అజీజ్ పాషాలకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా ప్రగతి భవన్ మారుతుందన్నారు. ఇక నుంచి ప్రగతి భవన్ కాదు.. ప్రజా భవన్.. అది ప్రజల ఆస్తి.. ప్రజల కోసం వినియోగిస్తాం అని రేవంత్ రెడ్డి చెప్పారు.
రేపటి భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2004-14 మధ్య కాలంలో అందించిన ప్రజా పాలన అందిస్తాం అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్మాణాత్మక సూచనలు చేయాలని బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, సోనియాగాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు, సోదరుడిగా అండగా నిలిచిన, స్ఫూర్తి నిచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనతో సమానంగా ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గతంలో ఏడున్నరేండ్లుగా మహరాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర హోం మంత్రిగా పనిచేసి, తెలంగాణ పీసీసీ కార్యవర్గానికి ఇన్చార్జిగా పార్టీలో సమస్యలు పరిస్కరించినా మాణిక్ రావు ఠాక్రేకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా తన ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించిన, ఎంపీ మాణిక్ రావ్ ఠాగూర్‌లకు, పార్టీ విజయం కోసం నెలల తరబడి తెలంగాణలో పని చేసిన ఏఐసీసీ కార్యదర్శులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన 30 లక్షల మంది నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతికి ధన్యవాదాలు తెలిపారు.