హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): చట్టం ముందు అందరూ సమానులేనని, తొక్కిసలాటలో ఒక మహిళ మరణిస్తే కేసు పెట్టొద్దా? అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ తొకిసలాట ఘటనలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయిందని, ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. ఈ విషయంలో కేసు పెట్టడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందుకే అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అల్లు అర్జున్ మామ తమ పార్టీకి చెందిన నాయకుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉన్నదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందని తెలిపారు ఈ-కార్ రేస్ పోటీల్లో నిధుల గోల్మాల్ జరిగినట్టు అధికారులు గుర్తించారని, ఇందులో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.