నాగారం, ఆగస్టు 24: తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అద్దంకి దయాకర్‌కు అధిష్ఠానం టికెట్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇస్తే తామంతా పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లెపాక రవీందర్ మాదిగ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని పసునూరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అద్దంకి దయాకర్ 2018 ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటు లో లేరని, టీవీ చర్చల్లో పాల్గొనడానికి మాత్ర మే వస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్లీ టికెట్ కోసం గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అద్దంకి దయాకర్‌కు టికెట్ ఇవ్వకుండా ఆ స్థానంలో ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ ఆదేశాల మేరకు భారీ మెజార్టీతో గెలిపించడం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే ముందు 9 మండలాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.