హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్టు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో మంగళవారం ఆయన పర్యాటకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చే యాలని అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు. టూరిజం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, హరిత హో టళ్లను ప్రైవేట్ హోటళ్లకు దీటుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
అంతర్జాతీయ పతంగుల పండుగకు హైదరాబాద్ సిద్ధమవుతున్నది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు హరితప్లాజాలో ఆవిష్కరించారు. ఈ పండుగలో 16 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళీ కైట్ క్లబ్బులకు చెందిన సభ్యులు పాల్గొంటారు.