Medical Seats | వరంగల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉన్నాయి. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ పిల్లలకు నష్టం జరుగుతున్నది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ చట్టంలో పేర్కొన్న గడువు ముగిసిన నేపథ్యంలో తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన 33జీవో ప్రకారం స్థానికత నిబంధనలను పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నిబంధనలతో అన్యాయం జరిగేలా ఉన్నదని స్థానిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేండ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. స్థానికతపై ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు : 8,715
ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు: 4,115
కన్వీనర్ కోటా: 3,498
నేషనల్ పూల్ సీట్లు : 617
ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు: 4,600
కన్వీనర్ కోటా సీట్లు : 2,300
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో తాజాగా పెట్టిన స్థానికత నిబంధనతో హైదరాబాద్‌లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకు చెందిన వారు విజయవాడ, గుంటూరులలో ఇంటర్మీడియట్ చదువుతారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన స్థానిక నిబంధనలతో ఇలా ఇంటర్మీడియట్ కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన వారికి స్థానికత కోటా ఉండడంలేదు. తెలంగాణలో పుట్టి పెరిగి రెండేండ్ల ఇంటర్మీడియట్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలకు మేలు చేసేందుకే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికత నిర్ధారణ కోసం వైద్య, ఆరోగ్యశాఖ జారీ చేసినట్టు చెబుతున్న ఈ 33 జీవో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ అందుబాటులో లేదని, పారదర్శకత లేకపోవడంతో ఈ జీవో అమలుపై అనేక అనుమానాలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఎంబీబీఎస్ సీట్లు బాగా పెరిగాయి. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్ల దందాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రైవేటు కాలేజీలు గతంలో ఒక్కో సీటు కోసం కోట్ల రూపాయలు వసూలు చేసేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ఈ ధరలు తగ్గాయి. స్థానికత కోటాలో ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ప్రైవేటు కాలేజీల్లో బీ క్యాటగిరీ సీట్లకు పోటీ పెరుగుతుందని, ఇది ప్రైవేట్ కాలేజీలకు మేలు చేస్తుందని విద్యార్థులు చెప్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్‌తో ముగిసింది. విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటాలోనూ ఇదే అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక కాలేజీలు లేనందున అక్కడి విద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్‌లో అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ను తీసుకువచ్చినట్లు స్పష్టమవుతున్నది.
ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిందని చెప్తున్న నూతన మార్గదర్శకాల వెనక ఆంధ్రా లాబీ ఉన్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ విషయంలో ఆంధ్రా విద్యాసంస్థల యాజమాన్యాలు కొన్ని తీవ్రస్థాయిలో లాబీ చేసినట్టు తెలంగాణ మేధావుల్లో విస్తృతస్థాయి చర్చ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అమలైన స్థానికత నిబంధనలను యథావిధిగా కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లే ప్రస్తక్తే లేదు. కానీ ప్రభుత్వం ఆ నిబంధనలను ఇప్పటికిప్పుడు ఎందుకు మార్చింది? అందులో అంతర్యమేంటని? తెలంగాణ విద్యావేత్తల్లో చర్చ జరుగుతున్నది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 30 ప్రభుత్వం, 30 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8,315 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో నేషనల్ పూల్ కింద 617 సీట్లు భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. రాష్ట్రంలో ఈసారి 77,848 మంది నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,356 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో నేషనల్ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు పదేళ్ల వరకు అమలైన 15 శాతం అన్రిజర్వ్డ్ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలల్లో 15 శాతం(అన్రిజర్వ్డ్) కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం సీట్లు దక్కనున్నాయి.
ఈ ఫొటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్‌ను ఏపీలోని విజయవాడలో పూర్తిచేసింది. నీట్లో ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా ర్యాంకు 35,655 సాధించింది. గత ప్రభుత్వ విధానాల ప్రకారం ఆమెకు స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుంది. 6-12(ఇంటర్) వరకు గరిష్ఠంగా ఎక్కడ నాలుగేండ్లు చదివితే అక్కడ స్థానికులుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 19న జారీచేసిన జీవో 33 ప్రకారం ఆమె నాన్‌లోకల్. ఈ జీవో ప్రకారం 9-12(ఇంటర్) వరకు తెలంగాణలో చదివిన వాళ్లే స్థానికులు. హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నందున, ఇక్కడ మెరుగైన బోధన లభిస్తుందనే ఉద్దేశంతో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి 9వ తరగతి నుంచి ఇంటర్ చదివిన వాళ్లు ఇప్పుడు స్థానికులు అయిపోయారు. అస్థిత్వం కోసం పోరాడిన తెలంగాణలో, ఇక్కడి బిడ్డలే ఇప్పుడు నాన్‌లోకల్‌గా మారిపోతున్నారు.