కాల్వశ్రీరాంపూర్/గోవిందరావుపేట, నవంబర్ 15: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమి టీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అలియాస్ గోపన్న, సికాస నేత రమేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయే క్రమంలోనే హైదరాబాద్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ) అధికారులు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పట్టుకున్నట్టు తెలిసింది. ఆజాద్ 30 ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల వరు స ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్న ఆజాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం కు చెందిన కొయ్యడ సమ్మయ్య-లక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా, రెండో కొడుకు సాంబయ్య మావోయిస్టు పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయా డు. గతంలో జరిగిన పలు ఎన్కౌంటర్లలో ఆజాద్ మృతిచెందినట్టు పుకార్లు రాగా, కుటుంబసభ్యులు తీవ్రంగా కలతచెందారు. ఆజాద్ లొంగిపోయాడని పత్రికల్లో రావడంతో కుటుంబసభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకుంటున్నారు. ఆజాద్ పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిసింది.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన మరో మావోయిస్టు నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ విషయపై పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బాధ్యుడిగా పని చేసి, ఏవోబీలో పని చేస్తున్నట్టు సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఈ పరిణామంలో కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో ఆజాద్, రాజిరెడ్డి లొంగిపోనున్నట్టు మండలంలో చర్చ జరుగుతున్నది.
ఆజాద్ పోలీసులకు దొరికాడన్న వార్త విన్న. నా కొడుకును పోలీసులు ఏమీ చేయొద్దు. లొంగుబాటు చూ పించి మాకు అప్పగించాలి. ఆజాద్ లొంగిపోతే అంతకన్న అదృష్టం లేదు. 30 ఏళ్ల నుంచి బిడ్డను కండ్లతోని చూడక మనోవేదనలో నా కుటుంబం ఉన్నది. ప్రాణాలతో కొడుకు ఇంటికి వస్తే అంతేచాలు. పోలీసు అధికారులు లొంగుబాటును చూపించి నా కొడుకును ఇంటికి పంపించాలని వేడుకుంటున్నా..
– సమ్మయ్య (ఆజాద్ తండ్రి)