హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం లౌకికవాద శక్తులన్నీ ఏకమై పోరాడాలని సీపీఐ, సీపీఎం అగ్రనేతలు అన్నారు. బీజేపీ ముక్త భారత్ లక్ష్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విజభన రాజకీయాలు దేశ సమగ్రతకే పెను ముప్పుగా పరిణమించాయని, ఇది ఇలాగే కొనసాగితే భారత ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. శనివారం సీపీఐ, సీపీ ఎం జాతీయ నేతలు.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలు, జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ దుర్మార్గ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగించేలా, దేశ రాజకీయాల నుంచి ఆ పార్టీని కూకటివేళ్లతో పెకిలించేలా భవిష్యత్తు ఉమ్మడి కార్యాచరణ అవసరం ఉన్నదని వామపక్ష నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇందుకోసం భావ సారూప్యత ఉన్న పార్టీలతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం.
యూపీ, పంజాబ్‌లో బీజేపీ ఓటమి ఖాయం
ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఫిబ్రవరి, మార్చిలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు సీఎం కేసీఆర్‌తో చర్చించినట్టు సమాచారం. ఆయా రాష్ర్టాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓటమి ఖాయమని, పంజాబ్‌లోనూ ఆ పార్టీకి మరోసారి ఓటమి తప్పదని విశ్లేషించినట్టు తెలిసింది. యూపీ ప్రజలు బీజేపీని తిరసరించనున్నారని, అక్కడ అఖిలేశ్ యాదవ్ గెలుపు ఖాయమని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం.
ఓటమి తెలిసే మోదీ వీధి నాటకాలు
పంజాబ్‌లో బీజేపీకి ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రధాని నరేంద్రమోదీ పరువు నిలుపుకొనేందుకు వీధి నాటకాలకు తెరలేపారని వామపక్ష నేతలు అన్నట్టు తెలిసింది. ఇటీవల పంజాబ్‌లో ఆ పార్టీ సభ కు జనం లేకపోవడంతో పర్యటనను రద్దు చేసుకొని వెనక్కి తిరిగి వచ్చిన ప్రధాని, దాన్ని భద్రతాలోపంగా ప్రచారం చేసుకొంటున్నారని అన్నట్టు సమాచారం.
ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరం
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం పోయిందని క మ్యూనిస్టు అగ్రనేతలు అన్నట్టు సమాచారం. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అవసరమని, ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్‌తో చర్చించినట్టు తెలుస్తున్నది. బీజేపీ పాలనతో దేశంలోని ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని అభిప్రాయపడ్డట్టు తెలిసిం ది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులకు వ్యతిరేకంగా దుర్మార్గపు పాలన సాగిస్తున్న బీజేపీని వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉన్నదని వారు స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. దేశంలోని భావసారూప్యత కలిగిన ప్రగతిశీల పార్టీలు, శక్తులన్నీ ఒకే వేదికపైకి రావాల్సిన అత్యవసరం ఉన్నదని స్పష్టంచేసినట్టు తెలిసింది.
ఆదుకోవాల్సింది పోయి.. అడ్డంకులు
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర సర్కారు వ్యవహరిస్తున్నదని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డట్టు సమాచారం. రాష్ర్టాలకు న్యాయపరంగా దక్కాల్సిన నిధులను కూడా ఇవ్వడంలేదని, మంచిగా పనిచేసే రాష్ర్టాలను ప్రోత్సహించాల్సింది పోయి, ఆటంకాలు సృష్టిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఇందుకు తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణగా చూపినట్టు సమాచారం. ‘తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం రంగంలో అభివృద్ధి పథాన పయనిస్తున్నది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వాల్సిన కేంద్రం, అడుగడుగునా అడ్డుకోవడం శోచనీయం’ అని వామపక్ష నేతలు అన్నట్టు తెలిసింది.
మీ ఆత్మీయతకు ధన్యవాదాలు
కేసీఆర్‌తో భేటీపై కేరళ సీఎం ట్వీట్
‘మీ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు. ఫలవంతమైన సమావేశం జరిగినందుకు సంతోషంగా ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌తో భేటీపై కేరళ సీఎం పినరయి విజయన్ ట్విట్టర్లో సంతోషం వ్యక్తంచేశారు. తమ పార్టీ అగ్రనేతలతో కలిసి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్టు వెల్లడించారు. కేరళ సీఎంవో కూడా తెలంగాణ సీఎంవోకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది.