గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్‌కు ఆయువుపట్టు. నాడు బ్యాక్ ఆఫీస్.. నేడు బ్యాక్ బోన్. తెలంగాణలో ఐటీ గురించి ఆ మధ్య మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఏదో ప్రాస కొద్దీ అన్న వ్యాఖ్యలు కావివి.. తొమ్మిదేండ్ల శ్రమకు ప్రతిఫలం. రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం. కేసీఆర్ మార్గనిర్దేశానికి, కేటీఆర్ ఆచరణకు ప్రతిరూపం. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. గణాంకాలే అందుకు సాక్ష్యం. ఓ అంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్‌కు వస్తుందన్నా, మనవాళ్లకు ఉద్యోగాలు దక్కుతున్నాయన్నా ప్రభుత్వం దగ్గర ఓ కార్యాచరణ ఉన్నది.. అదే రాష్ర్టాన్ని ‘ఐటీ హబ్’గా మార్చేసింది.
T Sat
హైదరాబాద్: తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీ రంగ ముఖచిత్రమే మారిపోయింది. లక్షల మందికి ఉద్యోగావకాశాలతోపాటు ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. దేశంలోనే ఐటీ రంగంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది. 9 ఏండ్లలోనే ఐటీ రంగం రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలకు కూడా విస్తరించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు దేశంలో ఐటీ అంటే బెంగళూరు పేరు వినిపించేది. అలాంటిది ప్రస్తుతం ఐటీ అంటే హైదరాబాద్ అనే స్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం కేంద్రంగా ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకుపోతున్నది.
ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోనూ హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పనితీరు వల్లేనని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 26 శాతం ఉండగా, ఐటీ ఉద్యోగావశాలు 24 శాతం వృద్ధి చెందాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళజాతి కంపెనీలు(ఎంఎన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఐటీ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి ఐదేండ్లకోసారి (2016, 2021)లో ఐటీ పాలసీలను రూపొందించి సమర్థంగా అమలు చేస్తున్నది. ఐటీ శాఖ పరిధిలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్‌ను ఏర్పాటు చేసి 8 టెక్నాలజీలను ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తున్నది.
తొమ్మిదేండ్లలో మూడు రెట్లు పెరిగిన ఐటీ ఎగుమతులు
టీహబ్‌తో వేల స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ, విశ్వవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన టై గ్లోబల్ సమ్మిట్-100 ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలో టీ-హబ్‌లోని 13 స్టార్టప్‌లకు చోటు లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లోని 80 నగరాల్లో నుంచి వెయ్యికి పైగా స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు రాగా, 68 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. అందులో 13 స్టార్టప్‌లు టీహబ్వే కావటం విశేషం. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో గ్రామ స్థాయిలో ఆవిష్కరణలు ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. స్టార్టప్ ఎకోసిస్టంను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఇతర పట్టణాలకు విస్తరించేలా స్టార్టప్ తెలంగాణ పేరుతో ప్రభుత్వం (https://startup. telangana.gov.in) వెబ్సైట్ ఆవిష్కరించింది. దాని ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా 77 స్టార్టప్ ఇంక్యుబేటర్లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వపరంగానే కాకుండా ప్రైవేటు రంగంలోని విద్యాసంస్థలు తమ ప్రాంగణాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసేవారికి ఒక వేదికను ఏర్పాటు చేశాయి. స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, వర్సిటీలు తమ ప్రాంగణాల్లో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రభుత్వ చొరవతో వేగంగా మార్పులు
It Hub Nanakramguda
హైటెక్ సిటీ, మాదాపూర్‌తో పాటు కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో ఐటీ మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీంతో నగరానికి పశ్చిమ దిక్కున ఉన్న ఐటీ కారిడార్ అటు కార్యాలయాలకు, నివాస ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా మెట్రోను విస్తరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసింది. 31 కిలోమీటర్లకు డీపీఆర్‌ను ఢిల్లీ మెట్రో రైలు సంస్థ అధికారులతో రూపొందించి, రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయి.
ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం
Dr Shantha Toutam
తెలంగాణ ఏర్పాటైన కొత్తలో 3 స్టార్టప్ ఇంక్యుబేటర్లు, 200 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 77 ఇంక్యుబేటర్లు, 7 వేల వరకు స్టార్టప్‌లు ఉన్నాయి. 2016 నుంచి స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టార్టప్ రంగంలో విశేష అనుభవం ఉన్న వారితోనే టీహబ్, టీవర్క్స్, టీఎస్ఐసీ, రిచ్, వీ-హబ్ వంటి ఇంక్యుబేటర్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తున్నది. వాటి ద్వారా వేల మంది వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీఎస్ఐసీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
– డాక్టర్ శాంతా తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ)
ఆకాశమే హద్దు
Amazon Campus
1998లోనే అప్పటి ప్రధాని, స్వర్గీయ వాజపేయి చేతుల మీదుగా ఐటీ రంగం వృద్ధికి హైటెక్ సిటీని మాదాపూర్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి 15 ఏండ్ల పాటు నెమ్మదిగా విస్తరించిన ఐటీ రంగం, తెలంగాణ రాష్ట్రంలో 9 ఏండ్లలోనే రెట్టింపు స్థాయి వృద్ధి సాధించింది. అందుకు ఇక్కడికి తరలివచ్చిన పెట్టుబడులే నిదర్శనం. గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, ఓలా, వన్‌ప్లస్, ఒప్పో, మైక్రాన్ ఇలా పదుల సంఖ్యలో బహుళ జాతీయ కంపెనీలు తమ ప్రధాన వ్యాపార కార్యకలాపాల కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. అనేక సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
మూలమూలకు ఐటీ.. కొత్తగా గ్రిడ్ పాలసీ..
It
ఐటీని నగరవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఐటీ పరిశ్రమలు ఈస్ట్ హైదరాబాద్ (తూర్పు) వైపు తరలించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రోత్సాహకాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఇందుకోసం అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పనపై దృష్టిసారించింది. హైదరాబాద్ గ్రోత్ డిస్పర్షన్ (గ్రిడ్)పాలసీలో భాగంగా ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 11 పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ఆదేశాలను జారీ చేసింది. ఇందులో కూకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, మల్లాపూర్, మౌలాలీ, సనత్‌నగర్, ఉప్పల్, నాచారం, పటాన్చెరు (కొంతభాగం), రామచంద్రాపురం, కాటేదాన్ వంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయి.
గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ
Data Centre Operators India
ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ నివేదికగా చెప్పుకునే జీఎస్‌ఈఆర్-2022లో రాష్ర్టానికి స్థానం దక్కింది. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టంలో తెలంగాణ టాప్-10లో నిలవగా, అదే సమయంలో ఏషియన్ ఎకో సిస్టం ఇన్ అఫర్డబుల్ టాలెంట్‌లో 4వ స్థానంలో నిలిచింది. ఈ పురోగతికి టీ-హబ్‌తో పాటు టీఎస్ఐసీ, వీ-హబ్, టాస్క్, రిచ్, టీ-వర్క్, తెలంగాణ ఇన్నోవేషన్ నెట్వర్క్ తదితర ఇంక్యుబేటర్ల నెట్‌వర్క్‌లు కీలకంగా మారాయి. అంతేకాదు.. అత్యాధునిక టెక్నాలజీల్లో మంచి నైపుణ్యం ఉన్నవారికి హైదరాబాద్ ఐటీ కంపెనీల్లోనే పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి.
It1