హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో టమాటా ధర భారీగా పెరిగింది. వారం రోజుల క్రితం కేజీ రూ.20 ఉన్న టమాటా కేజీ .40 నుంచి రూ.60 మధ్య విక్రయిస్తున్నారు. రాబోయే వారంరోజుల్లో ఇంకా పెరుగవచ్చని మార్కెటింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎండల తీవ్రత వల్ల పంటలు ఎండిపోవడంతో డిమాండ్‌కు తగినట్టుగా మార్కెట్‌కి టమాటా సరఫరా లేదని వ్యాపారులు తెలిపారు. నిరుడు టమాటా పంటలో నష్టం రావడంతో ఈ ఏడాది సాగును రైతులు తగ్గించారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వేసిన కొద్ది పంట కూడా దెబ్బతిన్నది.
దీంతో దిగుబడులు తగ్గి, సరఫరాలో కొరత ఏర్పడుతున్నది. జూన్ రెండో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రధాన రైతు బజార్లు కూకట్పల్లి, బోయినపల్లి, వనస్థలిపురం, సరూర్‌నగర్ మార్కెట్లలో కిలో. 40 వరకు విక్రయిస్తున్నారు. టోకుగా హైదరాబాద్ మార్కెట్లో క్వింటాల్ రూ.1,600 నుంచి రూ.2 వేలు పలుకుతున్నది.