Toll Charges | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు 5% పెరిగాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీలను పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించినప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా పడింది.
జూన్ 1తో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీల పెంపునకు అనుమతిస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కార్లు, జీపులు, వ్యాన్లకు టోల్ చార్జీ ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా ప్రయాణానికి రూ.10 చొప్పున పెరిగింది. బస్సులు, ట్రకులకు ఈ పెంపు రూ.25 (ఒకవైపు ప్రయాణానికి), రూ.35 (రెండు వైపులా ప్రయాణానికి), భారీ సరకు రవాణా వాహనాలకు రూ.35 (ఒకవైపు ప్రయాణానికి), రూ.50 (రెండు వైపులా ప్రయాణానికి)గా ఉన్నది.
ఈ లెక్కన హైదరాబాద్ నుంచి విజయవాడకు కారు, వ్యాన్, జీపు, లైట్ మోటర్ వాహనంలో వెళ్లాలంటే పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో మొత్తంగా ఒకవైపునకు రూ.335, రెండువైపులా అయితే రూ.500 చొప్పున టోల్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. స్థానికుల నెలవారీ పాస్ ధరను రూ.330 నుంచి రూ.340కి పెంచిన ఎన్హెచ్ఏఐ.. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేసే అన్నిరకాల వాహనాలకు 25% రాయితీ ఇవ్వనున్నది. పెంచిన చార్జీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.