హైదరాబాద్ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ సిస్టం ఏర్పాటు చేయలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నారని కొందరు కొన్ని మాధ్యమాల్లో అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కొన్ని మీడియాలో ప్రసారమవుతున్న దృశ్యాలు సన్న వడ్లని నేరుగా ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవడానికి రైతులే క్యూలో పెట్టారని, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కాకుండా టోకెన్లను స్థానిక యంత్రాంగం జారీ చేసిందన్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఇప్పటికే 86 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలోకి ఒక్క గింజ ధాన్యాన్ని రైతులు తీసుకురాలేదని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2142 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి 3,565 మంది రైతుల నుంచి 2లక్షల 36వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
వానాకాలానికి సంబంధించి కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, యాసంగి దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయమని చెప్పినందున యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన పెంచాలని మంత్రి గంగుల అధికారులకు సూచించారు.