నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు (Toddy Tapper) మృతి చెందారు. సిరసవాడ గ్రామానికి చెందిన మల్లేష్(43) అనే గీత కార్మికుడు తాటికల్లు గీసి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం తాటి చెట్లు ఎక్కి కళ్ళు తీయడానికి వెళ్లిన మల్లేష్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడ్డారు. గమనించిన తోటి గీత కార్మికులు ఘటన స్థలానికి వెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుగా మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య రాధికతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.