హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): అలీయావర్‌జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజేబిలిటీ రీజినల్ సెంటర్.. బధిరుల జీవితాల్లో వెలుగు నింపుతున్న దవాఖాన ఇది. 35 ఏండ్లుగా లక్షల మందికి సేవలు అందిస్తున్నది, మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్నది. మా గోడు ‘వినండి’ అని దవాఖానకు వచ్చే రోగులకు నామమాత్రపు రుసుంతోనే ఖరీదైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రత్యేకంగా పాఠశాలల్లోనూ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నది. రూ.10 లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సను సైతం ఉచితంగా చేస్తున్నది. వినికిడి లోపమున్న వారికి రూ.15 వేలు విలువ చేసే ఉపకరణాలను కూడా అందిస్తున్నది. బధిరులు మానసికంగా బలపడేందుకు కౌన్సెలింగ్ అందిస్తూ మనోధైర్యాన్ని నింపుతున్నది. టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 9590తో డిజేబిలిటీ ఇన్ఫర్మేషన్ లైన్‌ను నిర్వహిస్తున్నది. దివ్యాంగులకు ఉచిత సమాచారాన్ని అందజేస్తున్నది. బధిరులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇస్తూ, వాళ్లు జీవితంలో స్థిరపడేందుకు మార్గదర్శనం చేస్తున్నది. ఇప్పటి వరకు 300 మందికి పైగా బధిరులు ఉద్యోగాలు కూడా సాధించారు. ప్రత్యేకంగా ఉపాధి శిక్షణ కేంద్రాన్ని 20 ఏండ్లుగా నిర్వహిస్తూ కార్పెంటర్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నది. WWW.JOBSFORDEAF.ORG వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి బధిర ఉద్యోగార్థులకు, అవకాశాలను కల్పించేవారికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నది.
చెవి సంబంధిత వ్యాధులు, సమస్యలపై చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సెల్ఫోన్లు, ఇయర్‌ఫోన్స్, బడ్స్ అతివాడకం వల్ల వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. వీరికి చికిత్స అందించవచ్చు. పుట్టుకతో వినికిడి సమస్యలు ఉన్నవారిని సైతం సాధారణ చికిత్స, శిక్షణ ద్వారా మాములు వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చు. సమస్యలుంటే దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– హరిప్రసాద్, దవాఖాన అసిస్టెంట్ డైరెక్టర్