హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ సమావేశం శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగనుంది. ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే సమావేశంలో ప్రధానంగా రైతు బంధు నిధుల విడుదల, ధాన్యం కొనుగోళ్లు, ఇంటి స్థలం ఉన్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం, దళిత బంధు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన అనంతరం తొలిసారిగా రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతున్నది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.