హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నల్సార్ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో మొదటిసారిగా ‘అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్’ని శనివా రం ప్రారంభించనున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామం నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామసుబ్రహ్మణియన్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయా న్, జస్టిస్ పీ నవీన్‌రావు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. వ్యవసాయ విధానాలు వైవిధ్యాన్ని, ఆధునీకరణను సంతరించుకున్న తరుణంలో రైతులకు చట్టబద్ధంగా అందాల్సిన ఫలాలు, రైతు సాధికారతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ క్లినిక్‌లు పని చేయనున్నాయి. లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్లో శిక్షణ పొందిన పారా లీగల్ వలంటీర్ల ఆధ్వర్యంలో ఈ క్లినిక్‌లు పని చేస్తాయి. వీరు వ్యవసాయ చట్టాలు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు రైతుల హక్కులు, బాధ్యతలు, చట్ట పరమైన పరిష్కారాల లభ్యత గురించి రైతులతో చర్చిస్తారు.