హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉప ఎన్నిక జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 2.41 లక్షల మంది ఓటర్లున్న నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకొన్నామని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం 1192 మంది అధికారులను నియమించామని వెల్లడించారు. అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేర్చామని పేర్కొన్నారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో 3 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. వంద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశామని, 5500 మంది పోలీసులతో భద్రతాఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. బుధవారం వరకు రూ.8.02 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకొన్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్ చేస్తామని ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటుచేసినట్టు వివరించారు. 35 శాతం ఈవీఎంలను అదనంగా సిద్ధం చేసినట్టు తెలిపారు. సాంకేతిక లోపాలు తలెత్తితే.. సరిచేయడానికి 28 మంది ఇంజినీర్లను నియమించామని వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 199 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. పోలింగ్ సమాచారాన్ని ప్రతి రెండు గంటలకు ప్రత్యేక యాప్ ద్వారా అధికారులు తెలియజేస్తారని చెప్పారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని.. 6 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులు అధికారులకు అప్పగించిన తరువాతనే పోలింగ్ ఏజెంట్లు, సిబ్బంది వెళ్లిపోవాలని తెలిపారు. ఈ నెల 6వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని వికాస్‌రాజ్ వెల్లడించారు.
అందరూ ఓటెయ్యాలి
నియోజకవర్గంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈవో వికాస్‌రాజ్ కోరారు. ఇప్పటికే ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని తెలిపారు. ప్రతి ఓటరు ఓటు వేయడానికి ఓటరు ఐడీ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మునుగోడులో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. అప్పుడు 91.30 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అంతకు ముందు ఎన్నికల్లో(2014)లో 82.15 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల మాదిరిగానే ఈ ఉప పోరులోనూ భారీగా ఓటు నమోదు కావాలని, ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
