హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కోసం రూ. 12వేల కోట్లు కేటాయించాలని టీఎన్జీవో సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఆయా బడ్జెట్‌ను ఇప్పుడే సర్దుబాటు చేసుకోవాలని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రొవిజిన్ లేదంటే ఒప్పుకోబోమని స్పష్టంచేసింది. రాష్ట్ర బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ నేతృతంలోని బృందం శుక్రవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియాతో భేటీ అయ్యింది. పలు అంశాలపై చర్చించి, వినతిపత్రం సమర్పించింది. కొత్త పీఆర్సీ కోసం రూ.ఐదువేలకోట్లు, హెల్త్‌కార్డుల కోసం రూ.1,300 కోట్లు, డీఏ, బకాయిలు నెలకు రూ. 700 కోట్ల చొప్పున మొత్తంగా అన్నింటిని కలిపి రూ. 12వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని కోరింది. పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్ల విడుదలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని పేర్కొన్నది. సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ఖాదీర్ బిన్హసన్, గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు సుల్తానియాను కలిసిన వారిలో ఉన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఉద్యోగులంతా నగరాలు, పట్టణాల్లోనే నివాసం ఉంటారని, ఉద్యోగులను పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని చెప్పినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని,బడ్జెట్లో ఉద్యోగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టు వెల్లడించాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరుచేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్(టీపీటీయూ) డిమాండ్ చేసింది. కార్పొరేట్ దవాఖానల్లో నగదురహిత చికిత్సలు అందించాలని కోరింది. పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలని, మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలుచేయాలని కోరింది. శుక్రవారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది. జీవో-317 ద్వారా స్థానికత కోల్పోయిన వారికి పూర్తిన్యాయం చేయాలని కోరింది. సీఎస్‌ను కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు మట్లపల్లి రాధాకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.