TNGOs | తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తీరు కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగా ఉందని టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాంపల్లిలోని టీఎన్జీవోఎస్ కేంద్ర కమిటీ కార్యాలయంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం అత్యవసరంగా సమావేశమైంది. కొత్త ప్రభుత్వంలో ఒకటో తేదీనే వేతనాలు వచ్చినా పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జగదీశ్వర్ ఆరోపించారు.
ఇప్పటి వరకూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను వెంటనే విడుదల చేయాలని జగదీశ్వర్ డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేసి 50 శాతం వేతనాలు పెంచాలన్నారు. పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలని కోరారు. గతంలో రెండు డీఏలు రాకపోయినా ధర్నాలు చేశామన్నారు. ఇప్పుడు నాలుగు డీఏలు రాకున్నా ఉద్యోగులు ఓపిక పట్టారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటినా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వక పోవడం సరి కాదన్నారు. ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం తెచ్చిన జీవోను అమలు చేయాలన్నారు.