శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: తమ భూములను తమకు తిరిగిచ్చేవరకు నిరసన దీక్షలు ఆపేదిలేదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తేల్చిచెప్పారు. గోపన్‌పల్లిలో బీటీఎన్జీవోస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారంతో 100వ రోజుకు చేరుకున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లు నల్లటిదుస్తులు, మాస్కులు ధరించి వినూత్న తరహాలో నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. భాగ్యనగర్ ఎన్జీవోలకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన భూములను కొందరు ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి కొత్తగా లేఅవుట్ వేసి పాగా వేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేదిలేదని తేల్చిచెప్పారు. భూముల వ్యవహారంలో న్యాయపరంగా కోర్డుకు వెళ్లడంతో సమస్య పరిష్కారం ఆలస్యమవుతున్నదని అన్నారు.
సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తీసుకెళ్లామని, న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పి, పట్టించుకోకపోవడం బాధగా ఉన్నదని వాపోయారు. న్యాయం జరిగేవరకు ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని, వెనకడుగు వేసేదిలేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సయ్యద్ ముజీబ్ హుస్సేనీ, బీటీఎన్జీవోస్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.