హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంతో సంస్థకు, అందులోని 43,373 మంది ఉద్యోగులకు భరోసా లభించినట్టయింది. సంస్థ ప్రభుత్వంలో విలీనం అవుతున్నప్పటికీ ఆర్టీసీ మాత్రం మనుగడలో నే ఉంటుంది. అందులో కేంద్రం ఈక్విటీ ఉండ టం వల్ల కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేయడం కుదరదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్‌గా కొనసాగుతూనే, ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సిబ్బందిగా చలామణి అవుతారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్
ఆర్టీసీలోని శ్రామిక్, అటెండర్, డ్రైవర్, కండక్టర్ మొదలుకుని రీజినల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకూ అన్ని పోస్టులను ప్రభుత్వంలోని తత్సమాన పోస్టుల్లోకి మారుస్తారు. వేతన స్కేల్ ను వర్తింపజేస్తారు. పింఛన్ సదుపాయం లభిస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 4ఏండ్లకో సారి పే రివిజన్ జరుగుతుండగా, ఇకపై ఐదేండ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉంటుంది.
విలీనంతో వరమిచ్చిన సీఎం
రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) అధ్యక్షుడు ఎంఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ది గొప్ప మనసని, ఎప్పట్నుంచో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం వంటి గొప్ప వరం అందించారని కొనియాడారు. మంగళవారం బస్‌భవన్ వద్ద సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్ బాజిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తొలగనున్న జీతాల భారం
విలీన ప్రక్రియతో ఆర్టీసీపై జీతాల భారం తొలగనుంది. ప్రస్తుతం సంస్థ ప్రతి నెలా 200 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తోంది. విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లిస్తుంది. తద్వారా మిగిలే 200 కోట్లను సంస్థ అప్పులు, బకాయిలు తీర్చేందుకు వినియోగించే అవకాశం ఏర్పడింది. ఆర్టీసీకి ప్రస్తుతం 2,400 కోట్ల బ్యాంకు అప్పులున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భవిష్యనిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీపీఎస్) బకాయిలు మరో 3,600 కోట్లు ఉన్నాయి.