అలంపూర్, జనవరి 8 : బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చొరవతో ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు చేరింది. తుంగభద్ర నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో నియోజక వర్గంలోని రైతులు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగు చేస్తున్న రెండో పంటకు తగినంత నీరందక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. ఏపీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తుంగభద్ర డ్యాం నుంచి మనకు లెక్క ప్రకారం రావాల్సిన వాటా నీటిని విడుదల చేయించారు. ఆర్డీఎస్లో రెండో ఇండెంట్లో భాగంగా టీఎంసీ నీటిని డ్యాం నుంచి బుధవారం విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. రాబోయే మూడ్రోజుల్లో నది ద్వారా తుమ్మిళ్ల ఎత్తిపోతల వరకు నీరు చేరనున్నట్టు తెలిపారు. ఎత్తిపోతల నుంచి ఆర్డీఎస్ కెనాల్ ద్వారా ఆర్డీఎస్ ఆయకట్టుకు చేరుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.