హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ సంబురాలకు సిద్ధమైంది. టీజేఎఫ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతున్నందున శనివారం ( 31న) హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో సిల్వర్‌జూబ్లీ వేడుకలు జరుపుకోనున్నది. రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ జర్నలిస్టులు పాల్గొననున్నారు. 2001 మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలు, అనుసరించిన కార్యాచరణ, సాధించిన విజయాలపై చర్చ, ప్రసంగాలు నిర్వహించనున్నారు. ఈ సభలో జర్నలిస్టులతోపాటు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని టీజేఎఫ్ ప్రస్థానం.. తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర, తెలంగాణ జర్నలిస్టుల త్యాగాలపై ప్రసంగించనున్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు.. అనే ఉద్యమ నినాదం స్ఫూర్తిని కొనసాగిద్దామని రజతోత్సవాల వేళ టీజేఎఫ్ పునరుద్ఘాటించనున్నది.
రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ, అల్లం నారాయణ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ శక్తులను సమన్వయం చేస్తూ, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది టీజేఎఫ్. రజతోత్సవాలు 31న ప్రారంభమై ఏడాది పాటు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుక జలవిహార్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు సాగనున్నది. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగే ప్రారంభ సభలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన తెలంగాణ ప్రజా సంఘాలు, ఉద్యమ శక్తులు, వివిధ మేధావి వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. తెలంగాణ మలి దశ ఉద్యమ సారథిగా కేసీఆర్ ముందుకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన మూడు నెలల కాలంలోనే తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని, ప్రజల ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఉద్యమానికి అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టు వేదిక టీజేఎఫ్.
రాష్ట్ర సాధన ఉద్యమంలో, పార్టీలను ఉద్యమశక్తులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలను సమన్వయం చేస్తూ, సమాచారాన్ని చేరవేస్తూ టీజేఎఫ్ కీలకపాత్ర పోషించింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని ప్రజల ఆకాంక్షను వినిపిస్తూ సాగిన తెలంగాణ జర్నలిస్టుల పోరాటం దేశ చరిత్రలోనే గొప్పది. రజతోత్సవ సంబురాల్లో తెలంగాణ జర్నలిస్టుల భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే అంశంపై రాష్ట్రకార్యవర్గం చర్చించి కార్యాచరణను ప్రకటించనున్నది.