హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): ఫార్మా కంపెనీల కోసం లంబాడీల భూములు లాక్కోవడమే లక్ష్యంగా జరిగిన లగచర్ల కుట్రకు అసలైన సూత్రధారి సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డేనని బంజారా సంఘాల నేతలు ఆరోపించారు. కుట్రకు కారకులను వదిలిపెట్టి, రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు.
శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జరిగిన ‘లగచర్లలో ప్రభుత్వ నిర్బంధం-భవిష్యత్ కార్యాచరణ”పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో బంజారా, పౌర హక్కులు, విద్యార్థి, న్యాయవాద సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 15 రోజుల తర్వాత చలో హైదరాబాద్ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశం లో ప్రొఫెసర్ లక్ష్మణ్, ఓయూ విద్యార్థి నేత నెహ్రూ నాయక్, ఆలిండియా బంజారా సంఘం ప్రతినిధులు విష్ణునాయక్, రవినాయక్ పాల్గొన్నారు.
మా భూముల జోలికి వస్తే దేనికైనా తెగిస్తాం. చావనైనా చస్తాం కానీ, ఫార్మాకు భూములు ఇచ్చేది లేదు. దౌర్జన్యం చేస్తే తిరుగుబాటు జెండాను ఎగరేస్తాం. మా భూములు లాక్కుని రేవంత్‌రెడ్డి అల్లుడికి కట్నంగా ఇవ్వాలని చూస్తున్నారు.
– భీమానాయక్, లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్ విధ్వంసానికి తెరలేపారు. అణచివేతలతో లంబాడీలను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసంతో తండాలు మనుగడ కోల్పోతాయి. ఎకరం భూమికి రూ.60 లక్షలు ఉంటే.. రూ.10 లక్షలే చెల్లిస్తామనడం అన్యాయం. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించాలి.
-నారాయణరావు, పౌరహక్కుల సంఘం నాయకుడు
2024 జూలై నుంచే 6 తండాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. 300 మంది పోలీసుల పహారాలో 2 కిలోమీటర్ల పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. జనం హాజరుకాకపోయినా కలెక్టర్ అత్యుత్సాహం చూపారు. దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా రైతులను పోలీసులు కేసుల్లో ఇరికించారు. లగచర్ల ఘటన కుట్రకు కారణమైన రేవంత్ సోదరుడు తిరుపతిరెడిపై కేసు పెట్టాలి.
– సంజీవ్ నాయక్, సేవాలాల్ సేన జాతీయాధ్యక్షుడు