యాదాద్రి భువనగిరి, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారి కల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, జీలకర్ర బెల్లం తంతుతో యాదాద్రి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బాలాలయంలో వైభవోపేతంగా జరిగిన కల్యాణ వేడుకలను కనులారా వీక్షించి భక్తజనం పులకించింది. స్వామివారిని శ్రీరామ అలంకారంలో సేవించి హనుమద్వాహనం, గజవాహనంపై ఊరేగించిన అనంతరం తిరుకల్యాణ మహోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన ఉదయం 11 గంటలకు ఆగమశాస్త్రం ప్రకారం రెండు గంటలపాటు వైభవోపేతంగా నిర్వహించారు. శనివారం రాత్రి బాలాలయంలో నిర్వహించే రథోత్సవంలో స్వర్ణరథంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
పట్టువస్ర్తాల సమర్పణ
ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. టీటీడీ తరఫున స్వామివారికి టీటీడీ చైర్మన్ సతీమణి స్వర్ణలతారెడ్డి ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్ర్తాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి నరసింగరావు, కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రికి 1.48 కోట్ల విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భారీ విరాళం అందజేశారు. శుక్రవారం యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి దంపతులు ఈ మొత్తాన్ని ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఇందులో మంత్రి కుటుంబ సభ్యుల తరఫున రూ.50 లక్షల చెక్కు, బంధువులు, నియోజకవర్గం తరపున రూ.98,08,454 నగదు స్వామివారికి విరాళంగా సమర్పించారు.