నల్లగొండ ప్రతినిధి, జూన్ 7 (నమస్తే తెలంగాణ)/నీలగిరి: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎన్నికయ్యారు. బుధవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అర్థరాత్రి ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. తొలి రోజు చేపట్టిన తొలి ప్రాధాన్యం ఓట్లలో తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా, రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు లభించాయి. గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 1.55,095 ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో గురువారం అర్థరాత్రి నుంచి ఎలిమినేషన్ పద్ధతిలో ద్వితీయ ప్రాధాన్యం ఓట్లను లెక్కించారు. బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా, తొలుత తక్కువ ఓట్లు సాధించినవారిని ఎలిమినేట్ చేస్తూ ద్వితీయ ప్రాధాన్యం ఓట్లను లెక్కించారు. 47వ అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ ఎలిమినేట్ అయ్యే వరకు తీన్మార్ మల్లన్నకు 1,24,899 ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 105,524 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,956 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 30,461 ఓట్లు లభించాయి.
అనంతరం బక్క జడ్సన్, అశోక్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ పూర్తయిన తరువాత కూడా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోటాకు కొద్దిదూరంలో ఆగిపోయారు. అనధికార లెక్కల ప్రకారం మల్లన్నకు 1.50 లక్షల ఓట్లు, రాకేశ్‌రెడ్డికి 1.34 లక్షల ఓట్లు లభించినట్టు సమాచారం. దాంతో చివరలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని కూడా ఎలిమినేట్ చేస్తూ ద్వితీయ ప్రాధాన్యం ఓట్లను మల్లన్నకు పంచారు. అలా మల్లన్న మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లను చేరుకోవడంతో ఎన్నికల అధికారులు ఆయనను విజేతగా ప్రకటించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. తన విజయం సమిష్టి కృషి ఫలితమని, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరిస్తానని చెప్పారు.
గట్టి పోటీ ఇచ్చిన రాకేశ్‌రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఆది నుంచి గట్టి పోటీ ఇచ్చారు. తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో తొలి మూడు రౌండ్లలో తీన్మా ర్ మల్లన్న ఆధిక్యంలో ఉంటే నాలుగో రౌండ్లో రాకేశ్‌రెడ్డి స్వల్ప ఆధిక్యం ప్రదర్శించారు. తర్వాత అశోక్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ రౌండ్స్‌లోనూ సత్తాచాటారు. అశోక్ ఎలిమినేషన్లో ద్వితీయ ప్రాధాన్యం ఓట్లలో మల్లన్నకు 200 పైచిలుకు ఓట్ల ఆధిక్యం లభించగా, బీజేపీ అ భ్యర్థి ఎలిమినేషన్ రౌండ్లో రాకేశ్‌రెడ్డి సుమా రు 5 వేల ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి సబ్ పా ర్సిల్ ఓట్లలోనూ పోటాపోటీగా ఓట్లను సాధించారు. ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ కొనసాగింది. రాకేశ్‌రెడ్డిని ఎలిమినేట్ చేస్తే తప్ప మల్లన్నకు గెలుపు కోటా రాకపోవడం గమనార్హం.
నైతిక విజయం నాదే: రాకేశ్‌రెడ్డి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాంకేతికంగా ఓడినప్పటికీ నైతిక విజయం తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ఉన్నప్పటికీ తాను గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ పనైపోయిందని విమర్శిస్తున్నవారికి ఇది కనువిప్పు అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తనకు ఓట్లు వేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు, తన వెన్నంటి నిలిచిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.