Secretariat | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.సీఎస్, ముఖ్యఅధికారులు పరివారంగా వెళ్లారు. దీంతో సచివాలయంలో మంత్రుల పేషీలు టీచర్ లేని తరగతి గదుల మాదిరిగా తయారయ్యాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల పేషీల్లో అధికారులు సోషల్‌మీడియా పోస్టులతో టైంపాస్ చేస్తున్న వైనం ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. సచివాలయంపై అంతస్థులో నిలబడి దిగిన ఫొటోలను ఐ అండ్ పీఆర్ మంత్రికి చెందిన అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.
మేథో పరీక్షకు చెందిన ఓ ప్రశ్నకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఖాతా నుంచి సమాధానాలు పోస్ట్ అయ్యాయి. తెలంగాణ డిజిటల్ మీడియా ఖాతా నుంచి ‘మా తోటలోకి నెమలి వచ్చింది’ అంటూ ఫొటోలు హల్చల్ చేశాయి. ఇక ‘వీటిని మీమీ భాషల్లో ఏమని పిలుస్తారు?’ అంటూ బెండకాయల ఫొటోను ఓ వ్యక్తి ఎక్స్‌లో అప్లోడ్ చేస్తే దానికి ‘బెండకాయలు’ అంటూ సైబర్ క్రైమ్స్ పీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఖాతా నుంచి సమాధానం వెళ్లడం అన్నింటికన్నా హైలెట్ అని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. సార్లు ట్రిప్పుల్లో ఉంటే, అధికారులు సో‘చల్’ మోహనరంగా అంటూ కాలక్షేపం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.