Tikka Veereswara Swamy | అయిజ, ఫిబ్రవరి 15 : డాల్ బొమ్మల కళాకారుల నృత్య ప్రదర్శనలు, మేళతాళాలు, భాజ భజంత్రీలు, పటాకుల మోత, మార్మోగుతుండగా.. భక్తుల శివ నామస్మరణలు, నందికోల సేవ, చిన్నారుల హారతుల నడుమ తిక్కవీరేశ్వరుడు పురవీధుల గుండా ఊరేగాడు. పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాన్ని మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో చూడముచ్చటగా అలంకరించిన ఎడ్లబండిపై ఆశీనులను చేసి పట్టణంలో పురవీధుల గుండా భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
సంప్రదాయ బద్దంగా ఆలయ వ్యవస్థాపక వంశీయులు పాగుంట లక్ష్మిరెడ్డి స్వగృహం నుంచి తిక్క వీరేశ్వర స్వామిని ఎడ్లబండిపై ఆశీనులను చేసి ఊరేగింపుగా ఆంజనేయస్వామి దేవాలయం, పాత బస్టాండ్ మీదుగా తిక్కవీరేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కళశస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తూ పుట్టమన్ను తెచ్చి మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో పందిరి వేసి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి చట్టసేవలో భాగంగా మొండి సట్టంపై తిక్కవీరేశ్వరుడు పురవీధుల గుండా ఊరేగారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
డాల్ బొమ్మల కళాకారులు, విద్యార్థుల భక్తి గీతాల నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో కళాకారుల నృత్యాలను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. తిక్కవీరేశ్వరస్వామి ఎడ్లబండిపై ఊరేగుతుండగా, భక్తులు ఊరేగింపులో భారీ ఎత్తున పాల్గొనడంతో అయిజ పట్టణం భక్తిపరవశంతో మునిగింది.