శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత కల్పించినట్లు నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. మహా శివరాత్రి వేడుకలకు సమయం దగ్గర పడుతుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ముఖద్వారం నుంచి దైవ దర్శనం చేసుకునే వరకు భక్తులకు అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి గణపతి నంది సర్కిల్ వివిధ ప్రాంతాలను పరిశీలించారు.
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని వాహనాలను రోడ్డుకిరువైపులా నిలువ పెట్టకుండా చూసుకొని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సాఫీగా వెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం దైవదర్శనానికి వెళ్లే క్యూలైన్లను పరిశీలించారు. క్యూ లైన్లలో ఎలాంటి అసౌకర్యానికి తావులేకుండా క్యూలైన్లను పెంచాలని క్యూలైన్ల వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వీఐపీలు, వీవీఐపీలు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. పాగాలంకరణకు వెళ్లే మార్గాన్ని కూడా పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని సూచించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ ఆర్ రమణ, ఆత్మకూరు డీఎస్పీ శృతిచ, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణ, డిప్యూటీ ఇంజినీర్ నరసింహారెడ్డి, ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ పాల్గొన్నారు.