Tiger | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులులు వణికిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గతంలో ఉన్న రెండు పులులు కాస్తా.. 11కు పెరగడంతో ఇదిగో పులి.. అదిగో టైగర్ అన్న హెచ్చరికలతో స్థానికులు జంకుతున్నారు. పులుల భయంతో రోజువారీ పనులకు వెళ్లేందుకు అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. తాజాగా ఎర్రగుంట గ్రామశివారులో అటవీ అధికారులు పులి కదలికలను గుర్తించారు. మంచిర్యాల జిల్లా ముల్కల్లబీట్ పరిధిలోనూ మరో ఆడపులి సంచారాన్ని కనిపెట్టారు. ఇక్కడే మరో ఆడపులి ట్రాప్‌కెమెరాకు చిక్కింది. ఇదే ఏరియాలో మరో మగపులి సంచరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మందమర్రి, అందుగులపేట, తాండూరు మండలం నీలాయిపల్లి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బొంబాయిగూడ గ్రామ శివారులోని ఉచ్చమల్లవాగుతోపాటు సమీప పంటచేలల్లో మేకలకాపరులు పులి పాదముద్రలను చూసినట్టు తెలిపారు. పులల సంచారంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు గ్రామాల్లో చాటింపు వేయిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఓ వైపు జిల్లాను పులల భయం వెంటాడుతుంటే.. మరోవైపు కాగజ్‌నగర్ టైగర్ కారిడార్ ఏర్పాటుపై పంచాయితీ మొదలైంది. టైగర్ కారిడార్ ఏర్పాటు పేరుతో గిరిజనులకు పోడు భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నదని స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌బాబు పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ను టైగర్‌జోన్ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను అటవీశాఖ విరమించుకోవాలని డిమాండ్‌చేశారు. ప్రజాభిప్రాయం లేకుండా టైగర్‌జోన్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. టైగర్ కారిడార్ పేరుతో స్థానిక గిరిజనులపై అటవీశాఖ అధికారులు ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కౌటాల, డిసెంబర్ 26 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దులో పులి సంచరిస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర పరిధిలోని చంద్రపూర్ జిల్లా అమృత్గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైకి గురువారం పులి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కొందరు యువకులు ఫోన్లో చిత్రీకరించారు. చంద్రపూర్ జిల్లా తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు నిత్యం తెలంగాణలోని కాగజ్‌నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలోకి రాకపోకలు సాగిస్తున్నాయని, అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.