భీంపూర్, జనవరి 21 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రాష్ట్ర సరిహద్దున గల తాంసి(కే) శివారు రిజర్వాయర్ సమీపంలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు తెలిపారు. రిజర్వాయర్ పనులకు వెళ్లే కార్మికులు, సిబ్బంది సోమవారం రాత్రి పిప్పల్కోటి-తాంసి(కే) వెళ్లే రోడ్డును పులి దాటుతుండగా చూసి వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్ సమీపంలో బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు అమర్చారు. ఎఫ్ఎస్వో మోపత్రావు, ఎఫ్బీవోలు సాయి, శ్రీనివాస్, రామేశ్వర్, సిబ్బంది కృష్ణ, సోనేరావు గాలిస్తున్నారు. పులి ఆనవాళ్లు కానరానందున ఇప్పుడే ధ్రువీకరించలేమని తెలిపారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఈ ప్రాంతానికి పులుల వలస సాధారణమే అని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.