ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితం మండలంలోని చింతలబోరి గ్రామశివారులో అటవీ సిబ్బందికి కనిపించిన పులి.. మళ్లీ బుధవారం ఉదయం 6 గంటలకు చింతలగూడ పరిసరాల్లో ఓ మహిళ కంటపడింది. దీంతో భయాందోళనలకు గురైన ఆమె స్థానికులకు సమాచారమిచ్చింది. గ్రామస్థులు వెళ్లి చూడగా అది అప్పటికే పత్తి చేనులో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. కొంతసేపటి తర్వాత కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టేసిన ఎద్దులు పులిని చూసి తాళ్లు తెంపుకొని గ్రామానికి పరుగు తీశాయి. ఈ నేపథ్యంలో అటవీ సిబ్బంది పులి జాడను కనిపెట్టే పనిలో పడ్డారు.
సుమారు 20 మంది బేస్‌క్యాంపు సిబ్బంది పులిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బాబెరతండాలోని జాదవ్ దిలీప్‌నకు చెందిన ఎద్దుపై చింతగూడ అటవీ ప్రాంతంలో పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీ సిబ్బంది గుర్తించారు. దీంతో పెద్దపులి కదలికలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఒటరిగా బయటికి వెళ్లొద్దని తెలిపారు. త్వరలోనే పులిని పట్టుకుంటామని చెప్పారు.