కుంటాల/హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో రోజుకోచోట పులుల సంచారం వెలుగులోకి వస్తున్నది. అటవీ సమీపంలోని జిల్లాల్లో ఇటీవల పులుల సంచారం పెరిగింది. దీంతో అక్కడి ప్రాంతాల ప్రజలు, రైతులు భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రెండు వారాలుగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచరిస్తుండగా.. వారం క్రితం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో కనిపించింది. తాజాగా నిర్మల్ జిల్లాలో పులి కదలికలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుంటాల మండలంలో పులి సంచరిస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మండలంలోని సాయ న్న తన పొలంలో పులిని చూసి భయ ంతో పరుగులు పెట్టాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
రంగంలోకి దిగిన అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి సూర్యాపూర్ అటవీ ప్రాంతంలోకి పులి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే భైంసా రేంజ్ ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పులి జాడ కోసం కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేశారు. చెరువు వద్దకు వచ్చి పులి వెళ్లినట్టు కెమెరాలో కనిపించింది. పశువుల కాపరులు రాములు, చిన్నయ్య ఆదివారం మళ్లీ పెద్ద పులిని చూశారు. గేదెలకు నీళ్లు తాగించడానికి ఓలా బీట్ అడవిలోని చెరువు వైపు వస్తుండగా పులి ఓ గేదెను చంపేందుకు వెంబడించింది. కేకలు వేయడంతో పారిపోయింది. ప్రాణ రక్షణ కోసం రాములు చెట్టు ఎక్కగా చిన్నయ్య దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరు గ్రామస్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా భైంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్ నేతృత్వంలో ఎఫ్ఎస్వోలు లక్ష్మణ్, కీర్తి, డీఆర్వో శంకర్, ఈబీవో గ్రామస్థులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.