Tiger | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతున్నది. పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన మరుసటిరోజే.. సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడలో మరో వ్యక్తిపై పులి దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న సురేశ్ అనే రైతుపై పులి దాడికి దిగింది. అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న వ్యక్తులు కేకలు వేయడంతో బెదిరిపోయిన పులి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో పులి దాడిలో గాయపడిన రైతు సురేశ్‌ను ఆస్పత్రికి తరలించారు.
రైతు సురేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పులి దాడి నేపథ్యంలో దుబ్బుగూడలో హైఅలర్ట్ విధించారు. వ్యవసాయ కూలీలను ఫారెస్ట్ సిబ్బంది ఇంటికి పంపించేస్తున్నారు. కాగా, పులి సంచారం, దాడిపై ఆసిఫాబాద్ డీఎఫ్‌వో స్పందించారు.రెండోసారి పులి దాడి ఘటన దురదృష్టకరమని డీఎఫ్‌వో అన్నారు. పులి సంచారంపై ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని తెలిపారు.
కాగజ్‌నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమయంలో పత్తి ఏరుతున్న మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.