Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో టికెట్ల అమ్మకాల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. ఇప్పటికే ధర్నాలు, అగ్రనేతలను అడ్డుకోవటాలు, పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ముట్టడింపులు జరగ్గా.. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సొంతపార్టీ నేతలే ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కే ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి టికెట్ల పేరుతో కోట్లలో హవాలా దందా నిర్వహిస్తున్నారని పీసీసీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ మాజీ సభ్యుడు కురువ విజయ్‌కుమార్, ఆ పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఖలీముద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్లు ఆశిస్తున్నవారి నుంచి కోట్లకొద్దీ డబ్బు వసూలు చేస్తున్నారని, లేదంటే భూములు, ప్లాట్లు రాయించుకొంటున్నారని ఆరోపించారు. ఈ దందాలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా పాత్ర ఉన్నదని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో వారు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి టికెట్ల దందాపై సంచలన ఆరోపణలు చేశారు.
‘తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడపురుగు రేవంత్‌రెడ్డి.. తనకు నచ్చినవారికి, కోట్ల రూపాయలు ఇచ్చినవారికి అడ్డగోలుగా టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు. కోట్లు కుమ్మరిస్తేనే కాంగ్రెస్ టిక్కెట్లు వచ్చే రోజులు దాపురించినయ్. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి టికెట్లు వచ్చిన ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసిండు. డబ్బు లేనోళ్ల దగ్గర ఎన్నో ఎకరాల భూములు బాండ్ పేపర్‌పై రాయించుకున్నాడు. అవి కూడా కుదరని వారితో ఫ్లాట్లు రాయించుకొని.. వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాడు. డబ్బునంతా హవాలా మార్గంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించి ఏఐసీసీ పెద్దలకు పంచుతున్నాడు’ అని విజయ్‌కుమార్, ఖలీముద్దీన్ ఆరోపించారు. వందల కోట్లు తిన్న రాబందు రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి అతిపెద్ద హవాలా దొంగగా అవతరించాడని విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ‘హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో డబ్బు పంపించి.. అక్కడ ఖాన్ మార్కెట్లో తన సమీప బంధువుతో దుకాణం ఏర్పాటు చేయించి.. ఆ డబ్బును ఏఐసీసీ పెద్దలకు కూడా పంచుతున్నాడు. అందుకే మేము ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఠాక్రే వంటి సీనియర్ నేతలకు మెయిల్ చేసినా, లేఖలు రాసినా, ఫోన్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రేవంత్‌రెడ్డి, ఠాక్రే, కేసీ వేణుగోపాల్ వంటివారంతా కుమ్మక్కై రాహుల్‌గాంధీని పక్కదారి పట్టించారు. తప్పుడు నివేదికలు ఇచ్చి డబ్బులిచ్చినవారి పేర్లతో లిస్టును ప్రకటించారు. రెండు నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరిన 15 మందికి టిక్కెట్లు ఇచ్చారు. దీని వెనుక పెద్ద ఎత్తున మనీ ల్యాండరింగ్ జరిగింది. తెలంగాణలోనే పర్యటిస్తున్న రాహుల్‌గాంధీ ఈ విషయాలపై దృష్టిపెట్టాలి. కోవర్టు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకొనేందుకు టిక్కెట్లు రానివారితో, కొత్తవారితో, సీనియర్లతో కలిపి ఒక కమిటీ వేసి, నిష్పక్షపాతంగా విచారణ చేయించాలి’ అని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రణాళికాబద్ధంగా, కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్‌ను చంపుతున్నారని విజయ్‌కుమార్ మండిపడ్డారు. 45 ఏండ్లపాటు పొన్నాల లక్ష్మయ్య పార్టీ జెండాను మోస్తే.. ఆయనను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన చెందారు. పొన్నాల పార్టీ మారితే.. చనిపోయే దశలో పార్టీ మారడం అవసరమా? అని రేవంత్‌రెడ్డి తన అహంకారం చూపించారని మండిపడ్డారు. పొన్నాలకు ఒక న్యాయం.. కొడంగల్‌లోని గురునాథ్‌రెడ్డికి ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సీనియర్లు చిన్నారెడ్డి, మధుయాష్కి, పొన్నాల, ప్రభాకర్ వంటి నేతలు నేడు టిక్కెట్ల జాబితాలో లేరని అన్నారు. వాళ్లు కంటతడిపెడుతూ.. కాళ్లు మొక్కితేనేకాని టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ దుయ్యబట్టారు. మధుయాష్కీ ఎంపీగా గెలిచినప్పుడు.. రేవంత్‌రెడ్డి జడ్పీటీసీగా కూడా లేడని, అలాంటి పెద్ద నేతలతో నేడు కన్నీళ్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ వంటి చీడపురుగును ఏరివేయకపోతే కాంగ్రెస్‌కు మనుగడ ఉండదని అన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధంగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థుల లిస్టు విడుదలైందని విజయ్‌కుమార్, ఖలీముద్దీన్ ఆరోపించారు. రేవంత్‌ను ప్రశ్నిస్తున్నందుకు తమను పార్టీ నుంచి అక్రమంగా, అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సునీల్ కనుగోలు పేరు చెప్పి బోగస్ సర్వేలు చేయిస్తున్నారు. ముందే ఒప్పందం కుదుర్చుకొని, డబ్బులిచ్చినవారికే సర్వేలు అనుకూలంగా చేయిస్తున్నారు. బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించారు. రేవంత్‌రెడ్డి బలహీన వర్గాల నాయకత్వాన్ని చంపే కుట్ర చేస్తున్నాడు’ అని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి సీఎం’ అంటే తప్ప.. పక్కన తిరగనిచ్చే పరిస్థితి లేదని తెలిపారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఐదు ఎమ్మెల్యే టిక్కెట్లు కొత్తవారికే ఇచ్చారని విజయ్‌కుమార్ విమర్శించారు. ‘కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి కొన్ని కోట్లకు టిక్కెట్లు కొన్నట్టు ఆరోపణలొస్తున్నయ్. నాగర్‌కర్నూల్‌లో రాజేశ్‌రెడ్డి రాజ్పుష్పలోని ఫ్లాట్లు, విల్లాలు రాసిచ్చినట్టు చెప్తున్నారు. కొల్లపూర్లో జూపల్లి కృష్ణారావు రూ.30 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. వనపర్తిలో మెగారెడ్డి రూ.25 కోట్లు, గద్వాలలో సరిత రూ.10 కోట్లతోపాటు, ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్లు సమాచారం. ఇంకో నేత మరో రూ.60 కోట్లు ఇచ్చినట్టు మావద్ద ఆధారాలున్నాయి. ఓడిపోయే చోట్లలో బీసీ, మైనార్టీ వర్గాలకు టిక్కెట్లు ఇస్తామని అంటున్నారు. ఇలా పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటే.. రేవంత్‌రెడ్డి తన జీవితంలో సీఎం కాలేడు. అవినీతి మరకలంటిన పీసీసీ చీఫ్ సంతకం పెట్టిన బీఫామ్‌ను నేను తీసుకోను. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా సీఎం కాలేనని రేవంత్‌కు కూడా తెలుసు. అందుకే 2028ని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అసంతృప్త నేతలకు తన అనుచరులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారు. తల తెగిపడినా రేవంత్‌రెడ్డికి భయపడేది లేదు’ అని స్పష్టం చేశారు.
చంద్రబాబు, నారా లోకేశ్‌ల బంధువు అయిన సునీల్ కనుగోలుతో దొంగ సర్వేలు చేయిస్తూ.. చంద్రబాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డి డబ్బులిచ్చేవాళ్లకే టికెట్లు ఇస్తున్నారని విజయ్‌కుమార్ మండిపడ్డారు. ఇటీవల అమెరికా వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడ ఎన్నారైలతో కుమ్మక్కయ్యి అమెరికాలో ఉన్న తనవారికి టిక్కెట్లు ఇప్పించుకున్నాడని ఆరోపించారు. ‘అమెరికాలో ఉన్నవారి పేరు మీద సర్వేలు ఎలా చేశారు? వాటికి పాజిటివ్ రిపోర్టులు ఎలా వచ్చాయి? స్థానికంగా ఉన్నవారికి ఎందుకు నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి? ఈ దొంగ సర్వేలు చేయించడానికి సునీల్ కనుగోలుకు ఎన్ని కోట్లు ఇచ్చావ్?’ అని రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి హవాలా దందా నిగ్గు తేల్చాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. ‘ఎవరెవరికి టిక్కెట్లు వచ్చినయ్? ఎవరెవరి కుటుంబసభ్యులు, కంపెనీలు, సొంత బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు రేవంత్‌కు వచ్చినయ్? అనేది తేల్చాలి. రేవంత్‌రెడ్డితో సహా ఆయన చుట్టూ ఉన్న కోటరీ అకౌంట్ల లెక్కలు తీయాలి. గత ఆరు నెలలుగా ఎవరెవరి పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయినయ్? రేవంత్ షాడోలు ఎవరు? అనే విషయాలన్నీ నిగ్గు తేల్చాలి. అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు హవాలా రూపంలో ఎలా పోతున్నది? ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని రేవంత్ కుటుంబసభ్యులు, వారి దుకాణాలు, తరలిపోతున్న వందల కోట్ల రూపాయలపై తక్షణమే విచారణ చేపట్టాలని 28 పేజీలతో ఈడీకి విజ్ఞప్తి చేశాం. మా ఫిర్యాదును స్వీకరించినట్టు ఈడీ అధికారులు ధృవపత్రం ఇచ్చారు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలోని పరిణామాలపై ఫిర్యాదు చేశాం’ అని వివరించారు.