హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన బాబు శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. బాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొంతకాలంగా ఉపాధి లేక అవస్థలుపడ్డ బాబు తీవ్రమనస్తాపంతో దిక్కుతోచక తనువు చాలించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాదిన్న పాలనలో 102 మంది ఆటోడ్రైవర్లు చనిపోయారని ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకులు వేముల మారయ్య, నిరంజన్, శాతం రమేశ్ తెలిపారు.
ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం వంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆటోడ్రైవర్లను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.