CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తన మిత్రబృందంతో సైకిల్యాత్రగా ఏడురోజుల క్రితం బయల్దేరిన సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్ చేరుకొన్నారు. ప్రగతిభవన్లో వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించా రు. సీఎం కేసీఆర్ పట్ల వారికున్న అభిమానాన్ని తె లుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా రామాంజనేయరెడ్డి బృందం తీసుకొచ్చిన పె యింట్స్ను సీఎం కేసీఆర్ బిజీగా ఉండటంతో ఆయన తరఫున మంత్రి కేటీఆర్ స్వీకరించి, రామాంజనేయరెడ్డి కృషిని అభినందించారు. గంటికోట మట్టితో 20 రోజుల పాటు కష్టపడి కాన్వాస్ మీద ఆక్రిలిత్తో, మోనో కలర్లో గీసిన కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను అందించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడినై, సీఎం కేసీఆర్ను కలిసి తన చేతితో గీసిన చిత్రాలును అందించేందుకు ప్రొద్దుటూరు పట్టణం నుంచి సైకిల్యాత్రగా వచ్చినట్టు రామాంజనేయరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ‘సేవ్ ట్రీస్ ప్రాజెక్టు డైరెక్టర్’, ఆర్టిస్టు ప్రసన్న, శీల నారాయణ, రాజీ, సుబ్బనర్సయ్య పాల్గొన్నారు.
పట్టుదలే.. ఆయన పెట్టుబడి
కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాలలో జన్మించిన తుపాకుల రామాంజనేయరెడ్డికి ఆడిపాడే ఐదేండ్ల వయసులోనే పోలియో సోకింది. పేదరికం కావడంతో కూలి పనులు చేసుకొంటూ కొంతకాలం గడిపారు. ఆర్టిస్టు కావాలన్న తన చిన్ననాటి సంకల్పాన్ని మాత్రం వదలకుండా పెయింటింగ్ నేర్చుకుని, పెద్ద ఆర్టిస్టు అయ్యాడు. సమాజంలో ఆడపిల్లలపై వివక్షను చూసి చలించిపోయారు. ఆడపిల్లలను చదివించాలి, వారిపై వివక్షను దూరం చేయాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన లక్ష్యం ప్రతిఫలించేలా కొన్ని వందల చిత్రాలు రూపొందించి, ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ఇదేబాటలో ఆయన తన భార్యను ఉన్నత చదువులు చెప్పించి ఎమ్మార్వో ఉద్యోగం వచ్చేలా ప్రోత్సహించారు. కూతురును ఖగోళ శాస్త్రవేత్తను చేయించాలన్న సంకల్పంతో చదివిస్తున్నారు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు చిత్రాలు గీసి వాటిపై ‘సేవ్ గర్ల్ చైల్డ్’ లోగో వేసి వారికి అందజేస్తూ విశేష ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు రామాంజనేయరెడ్డి ఆకర్షితుడయ్యారు. మూడేండ్లుగా సీఎం కేసీఆర్ను కలవాలని సంకల్పం పెట్టుకొన్నారు. స్వహస్తాలతో అపురూపంగా గీసిన కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను ఆయనకు అందించేందుకు ప్రొద్దుటూరు పట్టణం నుంచి తన మిత్రబృందంతో సైకిల్ యాత్రగా బయలుదేరి వచ్చాడు. మూడేండ్లనాటి కలను రామాంజనేయరెడ్డి నేడు నెరవేర్చుకొన్నారు.