యాదాద్రి భువనగిరి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే మందుల సామేల్ వచ్చారు. వేదికపై కూర్చునేందుకు వెళ్తుండగా.. చైర్మన్ సందీప్‌రెడ్డి సభ్యుల స్థానంలో కూర్చోవాలని సూచించారు.
దాంతో సామేల్ కింద సభ్యులు కూర్చున్నచోట ముందు వరుసలో కూర్చున్నారు. ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సైతం వచ్చి సామేల్ పక్కనే కూర్చున్నారు. కొద్దిసేపటికే మందుల సామేల్ కుర్చీ లొల్లి షురూ చేశారు. ఎమ్మెల్యేలం వేదికపై ఎందుకు కూర్చోవద్దని ప్రశ్నించారు. కింద కూర్చోవాలని జీవో కాపీ ఉన్నదా? ఉంటే ఇప్పుడే చూపించాలంటూ స్వరాన్ని పెంచారు. పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నదని సందీప్‌రెడ్డి చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా తనకు కలెక్టర్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.
జడ్పీ సమావేశానికి, కలెక్టర్‌కు సంబంధం ఉండదని సందీప్‌రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. ‘నువ్వేంది చెప్పేది.. గత సమావేశాల్లో కూర్చున్నాం.. ఇప్పుడెందుకు కూర్చోవద్దు.. అంటూ భీష్మించారు. సమావేశం ఎమ్మెల్యేల కోసం కాదు.. రాజ్యాంగం గురించి తెలుసుకోండి.. ఏక వచనంతో మాట్లాడుతూ నోరు జారుతున్నారు.. గతంలోనూ నోరు జారారు.. మర్యాద కాపాడుకోవాలి’ అంటూ సందీప్‌రెడ్డి హితవు పలికారు. జడ్పీ సీఈవో అయినా సమాధానం ఇవ్వాలని సామేల్ మళ్లీ పట్టుబట్టారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చైర్మన్ నిర్ణయం మేరకు వేదికపైకి ఆహ్వానిస్తారని సీఈవో శోభారాణి వివరణ ఇచ్చారు.