హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఆదివారం తెలిపారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, విద్యార్థులు కలిపి 200 బృందాలుగా ఏర్పడి ప్రతి వారం 400 గ్రామాల్లో రైతులతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
యూరియా వినియోగం తగ్గింపు, సమతుల్య ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మారెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు, సాగునీటి ఆదా, సేంద్రియ వ్యవసాయం తదితర అంశాలపై సుమారు 2.45 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంపు దిశగా మారెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రానికి అనువైన, అధిక దిగుబడి ఇచ్చే 8 సన్న రకాలను గుర్తించినట్లు తెలిపారు.