Tigers | రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన రెండు పులుల మృతి ఘటనలో ఎట్టకేలకు ముగ్గురు నిందితులను గుర్తించారు. పులిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పశు కళేబరంపై విషం చల్లినట్లు నిందితులు విచారణలో అంగీకరించారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులులు మృతి ఘటనను అటవీ శాఖ సీరియస్‌గా తీసుకున్నది. విషప్రయోగం చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి మండలం వెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన కోవా గంగు, ఆత్రం జల్పతితో పాటు 11 ఏళ్ల మైనర్ బాలుడు విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
చనిపోయిన పశువుపై విషం చల్లడంతో.. ఆ మాంసాన్ని తిన్న పులి చనిపోయిందని విచారణలో నిందితులు అంగీకరించినట్లు ఆసిఫాబాద్ డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టేబ్రీవాల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం తాము సేకరించామని చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. వీరిలో గంగు, జలపతికి న్యాయస్థానం 12 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. ఇక మైనర్‌ను పేరెంటల్ బాండ్‌పై రిలీజ్ చేసిందన్నారు. పులుల మృతి ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని.. పూర్తిస్థాయి సమాచారం తర్వాత వెల్లడిస్తామని డీఎఫ్‌వో తెలిపారు.